సమాజ సేవకు ఈ సూపర్‌స్టార్ ఎప్పుడూ ముందుంటాడు. అప్పట్లో ఆయన తండ్రి కృష్ణ గారు కూడా దానదర్మాల్లో శ్రీమంతుడే... పలు ప్రకృతి వైపరీత్యాలకు ఆయన అందరికన్నా ముందుండి సహాయం చేస్తుండేవాడు. ఇప్పుడు తనయుడు ఆయనను మించి సమాజ సేవలో ముందుంటున్నాడు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తి అనుకోవాలో లేదా ఈయనకు ఇలాంటి ఆలోచనలు ముందు నుండే ఉన్నాయి కాబట్టి ఇలా సమాజానికి సేవ చేయాలనుకున్నాడో గానీ... ఇటీవల వెల్లడించిన ఊరిని దత్తత తీసుకునే కార్య క్రమాన్ని ట్విట్టర్ లో ప్రకటించాడు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లాలో బాగా వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తానని ట్వీట్ చేశాడు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ తోనూ, తెలంగాణా మంత్రి కేటీఆర్ సూచనపై ‘గ్రామజ్యోతి’ పథకం నేపథ్యంలోను తాను ఈ గ్రామాల దత్తతకు ముందుకొచ్చానని మహేష్ బాబు పేర్కొన్నాడు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని అభివృద్ది చేయాలని తన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సూచించిన విషయాన్ని కూడా గుర్తు చేసిన ఈ సూపర్ స్టార్.. సమాజానికి తాను సైతం తనకు తోచినంతవరకూ సేవలు అందిస్తానని అన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నదీ త్వరలో ప్రకటిస్తానని చెప్పాడు.