ఈ మధ్య కాలంలో హీరోలంతా సేఫ్ సైడ్ గా ఇతర బిజినెస్ ప్లానింగ్స్ చేపడుతున్నారు. నాగార్జున ఇప్పటికే చాలా రకాల బిజినెస్సుల్లో ఎంటరయ్యాడు. ఎన్టీఆర్ కమర్షియల్ ప్రాపర్టీస్ కొనేస్తున్నాడు. ఇక మహేష్ బాబు ఇప్పటికే నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా సంబంధిత వ్యాపారంలో కూడా అడుగు పెట్టేస్తున్నాడు. అదే మూవీ ఎగ్జిబిషన్ వ్యాపారం. ప్రస్తుతం థియేటర్స్ నిర్వహణ అంత లాభదాయకంగా లేదన్న మాట వాస్తవమే. అయితే, ఈ రంగంలోకి ప్రవేశించేందుకు నటీనటులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ప్రధానం మల్టీప్లెక్సుల నిర్వహణ ఊరిస్తోంది.
భవిష్యత్తులో మంచి లాభసాటి వ్యాపారంగా మారనుందనే అంచనాలున్నాయి. అందుకే మహేష్ కూడా ఓ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్వహించబోతున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ గచ్చీబౌలి ప్రాంతంలో ఉన్న ప్రిస్టన్ ప్రైమ్ మాల్ లో మల్టీప్లెక్స్ నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంటున్నాడు మహేష్. నాలుగు స్క్రీన్లు ఉన్న ఈ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్.. త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ వెంచర్ కోసం 12కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక హైద్రాబాద్ లోనే కాకుండా.. తెలంగాణ ఏపీ వ్యాప్తంగా ఫిలిం ఎగ్జిబిషన్ రంగంలోకి ప్రవేశించేందుకు మహేష్ సన్నద్ధమవుతున్నాడు.
వెంకీ రాణా కలిసి ఇప్పటికే కేపిటల్ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. రీసెంట్ గా దీన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా. వీళ్లిద్దరే కాకుండా మెగా ఫ్యామిలీ కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.