బాలీవుడ్ నటుడే అయినా మన తెలుగు వారికి సుపరిచితుడైన వాడు మనోజ్ బాజ్ పాయ్. అప్పటి వరకూ చిన్న చిన్న పాత్రల్లో బాలీవుడ్ సినిమాల్లో నటించిన బాజ్ పాయ్ కు రాంగోపాల్ వర్మ సత్య సినిమాలో మంచి బ్రేక్ ఇచ్చాడు. ఇది హిందీలో తీసినప్పటికీ తెలుగులోకి డబ్ చేశారు. గాంగ్ స్టర్ లైఫ్ ఎలా ఉంటుందనేది ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రం ఆయనకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది కూడా. దీని తరువాత ఆయన అవార్డుల యాక్టర్ గా కూడా పేరుగడించాడు. వైవిధ్యమైన పాత్రలకు చిరునామా అయిన హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇప్పుడు నిర్మాతగా మారారు. మనోజ్ బాజ్‌పాయ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆయన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు టబు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషనల్ లో ఇంతకు ముందు సోనాగచి, దిల్ పే మత్ లే యార్, ఘాట్ అనే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈయన నిర్మించబోయే సినిమాకు అముకుల్ అభ్యాంకర్ దర్శకుడు. ఈయన నిర్మాణకత్వంలో వైవిధ్యమైన సినిమాలు తీయాలని అనుకుంటున్నట్టు వెల్లడించాడు బాజ్ పాయ్. కరడుగట్టిన విలనిజాన్నీ తన హావభావాల్లో పలికించిన ఈ నటుడే, హాపీ లాంటి సినిమాలో మంచి, పిచ్చి పోలీసాఫీసర్ గా హాస్యాన్నీ ఒలికించాడు. మరి ఇంత మంచి నటుడి సారధ్యంలో తప్పనిసరిగా మంచి సినిమాలనే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్.