ఇప్పటివరకూ మెగా ఫామిలీ మెంబర్స్ ఎంతో మంది పేదలకు సహాయం అందిస్తూ సమాజానికి పరోక్షంగా సహాయపడుతున్నారు. ఇప్పుడు ‘మా’ కోసం మెగా ఫ్యామిలీ హీరోలు రూ. 6 లక్షల విరాళం అందించారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల పోరులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ 87 ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే! ఇప్పటికే ఆయన ప్రమాణస్వీకారం అయిపోయింది కూడా! ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ 2 లక్షలు, అల్లు అర్జున్ 2 లక్షలు, వరుణ్ తేజ్ 1 లక్ష, సాయి ధరమ్ తేజ్ 1 లక్ష విరాళం ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నాగబాబు ఇందుకు సంబంధించిన చెక్ ఆయనకు సమర్పించారు. దీంతో ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం విరాళాలు అందిస్తే బావుంటుందని, ఈ విరాళాలు పేదకళాకారులకోసం సహాయార్థం ఉపయోగించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగానే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... పేద కళాకారులకు మంచి చేయాలనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసానని, సంకల్పబలమే తమను ముందుకు నడిపించిందని చెప్పుకొచ్చారు. కార్పస్ ఫండ్, పెన్షన్ డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారనే ఆందోళన అవసరం లేదు. ‘నాగబాబుగారు విరాళంతో మొదలు పెట్టారు. విదేశాల్లోని మిత్రులు కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. త్వరలోనే జనరల్ బాడీ మీటింగు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.