2014 విశాదవార్తలకు నిలయమైంది. ఎంతో మంది కళాకారులను దూరం చేసింది. ముఖ్యంగా తెలుగు సినిమా వారికి కలిసి వచ్చినట్టు లేదు. మంచి మంచి ఆర్టిస్టులను తీసుకుపోయింది. ఈ సంవత్సరం మొదటి నుంచీ వరుసగా మరణాలు ఎక్కువగానే మిగిల్చింది. క్రితం సంవత్సరం శ్రీహరి, ఎవిఎస్, ధర్మవరపు సుబ్రమణ్యం వంటి మంచి ఆర్టిస్టులను కోల్పోగా అది అలా కొనసాగుతూ వచ్చింది. వయసు మీరి చనిపోతే ఒక రకం. కానీ ఉదయ్, చక్రి మరణాలు ఊహకు అందనివి. 2014 జనవరిలో ఉదయ్ కిరణ్ చాలా చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుని అభిమానులను కలవరపరిచారు. అలాగే చక్రి కరెక్టుగా కెరీర్ పీక్లో ఉన్నప్పుడు కేవలం 40 సంవత్సరాల వయస్సులో హార్ట్ ఎటాక్ తో మృత్యువుని ఆహ్వానించి నివ్వెరపరిచారు. వీరందరికీ నివాళులు అర్పస్తూ ఓ సారి అందరినీ గుర్తు చేసుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు కేన్సర్ బారిన పడి చివరి క్షణాల వరకూ అందరికీ ధైర్యం చెప్పి కళామతల్లికి గుడ్ బై చెప్పారు. బాపు తన బొమ్మలతో తెలుగువారి జీవితాల్లో చెరగని ముద్రవేసి వెళ్లిపోయారు. ఓ దర్శకునిగా, చిత్రకారునిగా, కార్టూనిస్టుగా ఆయన కళామతల్లికి ముద్దుబిడ్డగా సేవలు చేశారు. తెలంగాణా శకుంతల తెలుగు తెరపై టిపికల్ తెలంగాణ స్లాంగుతో అదరగొట్టిన నటి. విలనిజం, కామెడీ, సెంటిమెంట్ ఇలా ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషింగల సత్తా ఉన్న నటి. అటువంటి మహానటి గుండెపోటుకు గురైంది. జూ.ఎన్టీ ఆర్, కళ్యాణ్ రాం ల సోదరుడు అయిన నందమూరి జానకీరామ్ మృతి తెలుగు చిత్రసీమను కుదిపేసిందని చెప్పాలి. ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా తన పనులు తాను చేసుకుంటూ పోయే ఆయన యాక్సిడెంట్ కు గురి అవటం ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పి.జె.శర్మ వెండితెరపై అనేక సినిమాల్లో జడ్జి పాత్రను పోషించడమే కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరుపొందాడు. అంతే కాదు సాయికుమార్, రవిశంకర్ వంటి డైలాగ్ కింగులను కళామతల్లికి అందించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. తెలుగు సినీ చరిత్రలో తనదంటూ ఒక పేజీని లిఖించుకున్న చక్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. చెదరని జ్నాపకాలను మిగిల్చిన ఈ కళామతల్లి ముద్దుబిడ్డలకు ఆత్మశాంతి కలగాలని మనందరం ప్రార్థిద్దాం.