చైతన్య తమ్హానే మరాఠీలో నిర్మించిన చిత్రం 'కోర్ట్' ఈ సంవత్సరం (2016) 'ఫారిన్ లాంగ్వేజెస్' కేటగిరీలో ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైంది. గత సంవత్సరం 'లంచ్‌బాక్స్' సినిమా విషయంలో వివాదం తలెత్తినట్లే ఈసారి కూడా ఈ సినిమా విషయంలో వివాదం చెలరేగుతోంది. ఎంపిక కమిటీ అధ్యక్షుడు, పూర్వపు నటుడు అమోల్ పాలేకర్‌కు జూరీ సభ్యుడు రాహుల్ రావైల్‌కు మధ్య వాగ్వాదం జరిగిందట. భారతీయ ఫిలిం ఫెడెరేషన్ ఈ విషయంలో తన అసంతృప్తిని వెల్లడించింది. రాహుల్ రావైల్ మీడియాకు వెళ్లే ముందు ఫెడెరేషన్‌తో సంప్రదిస్తే గౌరవంగా వుండేదని ఫెడెరేషన్ సెక్రెటరీ జనరల్ సుప్రణసేన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సుప్రణసేన్ మాట్లాడుతూ 'కోర్ట్' సినిమాను జూరీ సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారనీ, కానీ చిత్రసీమకు చెందిన ఒకానొక సభ్యుడు కొన్ని ఆరోపణలు గుప్పించడంతో రాహుల్ రాజీనామా చేశారని చెప్పారు. ఫైనల్ ఎంపిక జరిగినప్పుడు సుప్రణసేన్‌తో బాటు డిప్యూటీ సెక్రెటరీ జనరల్ అనింద్యదాస్ గుప్తా కూడా అక్కడే వున్నారు. ఓటు వేసే సమయానికి రాహుల్ రావైల్ బయటకు వచ్చేయడంతో వివాదం తారాస్థాయికి చేరింది. కొందరి అభిప్రాయం ప్రకారం అధ్యక్షుడు అమోల్ పాలేకర్ కూడా 'కోర్ట్' చిత్రం ఎంపికపై అసంతృప్తితోనే వున్నాడనీ, కానీ అందరితోబాటు గౌరవపద్రంగా వోటు వేశారని తెలిసింది. ఈ విషయాన్ని రాహుల్ రావైల్ రాద్ధాంతం చేసినట్లు తెలుస్తోంది.
ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఈ చిత్రాన్ని ఎంపికచేశారు.భారత న్యాయస్థాన విధివిధానాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మరాఠీ దర్శకుడు చైతన్య తమన్ దర్శకత్వం వహించారు. విదేశీ చిత్రం కేటగిరిలో ఇప్పటివరకు ఏ భారత చిత్రానికి ఆస్కార్ దక్కలేదు. మదర్ ఇండియా, సలామ్ ముంబయి చిత్రాలు మాత్రమే ఇప్పటివరకు టాప్ ఐదు చిత్రాల్లో చోటు సాధించాయి. ఈ ఏడాది కోర్టును ఎంపిక చేసినట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. తమ చిత్రం ఆస్కార్ రేస్‌కు ఎంపిక కావడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేశారు. జానపద కళాకారుడు జితన్ మరండీ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జితన్ కోర్టు తన మాటలు నమ్మకపోవడంతో స్థానిక కోర్టులో ఆత్మహత్యాయత్నం చేసే నేపథ్యమే ఈ సినిమా కథ.