పాత సినిమాల్లో రాజనాల విలనీని చూసి వణికిపోయేవారు. ఆయన్ను అనుకోకుండా బయట చూసిన ఓ పల్లెటూరి వనిత ఆవేశం తట్టుకోలేక తిట్టిపోసిందట ...! నిజమే... సినిమాలో విలన్లను చూస్తే అంతలా రియాక్ట్ అయిపోతాం... మనకు అంత కోపం తెప్పించారంటే అందుకు కారణం వాళ్ళు అంత బాగా నటించారనే కదా..! సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎంత ముఖ్యమో విలన్లకూ అంతే స్థాయి ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోసారి హీరోను కూడా డామినేట్ చేస్తుంటారు... ‘వదలబొమ్మాలీ... నిన్నొదల...’ అని గట్టిగా అరిస్తే... చిన్నపిల్లలు భయపడి గుక్కపెట్టి ఏడ్చేస్తారు... అంత వణికించేలా ఉంటుంది వారి నటన... సినిమాకు ఇంత ముఖ్యమైన విలన్ ఎంపిక అంత సులువైన పనేం కాదు... మన టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎంత ఉందో... విలన్లకూ అంతే కొరత ఏర్పడింది. వీరిని కూడా చాలా వరకు బాలీవుడ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నారు మన తెలుగు ఇండస్ట్రీ వారు. అలా దిగిపోయిన హై రెమ్యునరేషన్ తీసుకుంటున్న విలన్లు ఎంత మంది ఉన్నారో మీరే చూడండి....
సోనూ సూద్: పంజాబ్ కు చెందిన సోనూసూద్ మోడల్, నటుడు, ప్రొడ్యూసర్ కూడా. ఈయన ఉత్తర భారతీయుడే అయినప్పటికీ మొదటిగా నటించింది తమిళ సినిమాలో. ఆ తరువాత మన తెలుగులోనూ చాలా సినిమాలు చేశాడు. బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు సూపర్, అతడు, అశోక్, అరుంధతి. అరుంధతిలో చేసిన పశుపతి యాక్షన్ కు ఎపీ నంది అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత రవి తేజ ఆంజనేయుడులో, ఏక్ నిరంజన్, ఆగడు, దూకుడు, జులాయి సినిమాల్లోనూ నటించి తెలుగు పరిశ్రమకు అభిమాన విలనీ అయిపోయాడు.
దేవ్ గిల్: ఈయన మంగధీరలో చూపించిన విలనీని ఎవరైనా మరచిపోగలరా? తండ్రినీ ఒక్క వేటుతో నరికేసిన కర్కషుడిగా నటించాడు. తెలుగులో మొదట కృష్ణార్జునలో నటించాడు. ఆ తరువాత మగధీర దీంతో తెలుగులో చాలా ఆఫర్లే వచ్చాయి దేవ్ గిల్ కు. రగడ, ప్రేమ కావాలి, పూలరంగడు, రచ్చ, నాయక్, అడ్డ సినిమాల్లో నటించాడు.
ఆశిష్ విద్యార్థి: కేరళకు చెందిన వాడైనప్పటికీ ఢిల్లీలో ఉండడంతో హిందీ సినిమాల్లో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత తెలుగులోనూ చాలా సినిమాలు చేశాడు. ఎంత విలనీగా చేయగలడో అంత కామెడీనీ పండించగలడీ నటుడు. ఈయన తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు బాగా పేరు తెచ్చినవి పోకిరీ, లక్ష్యం, తులసి, అతిథి, చిరుత, అతనొక్కడే, అదుర్స్, అన్నవరం, గణేష్ మొదలైనవి.
ప్రదీప్ సింగ్ రావత్: ఈయనను మన తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ముఖ్యంగా సై సినిమాలో ఈయన పెర్ఫార్మెన్స్ వళ్ళు జలదరిస్తుంది. ఆ బాడీ... ఆ ఫేస్... ముఖ్యంగా రాజమౌళి ఈయన ఫేస్ లో దున్నపోతును చూపించడం... ఇంతకంటే క్రూరుడు ఉంటాడా? అన్నట్టున్నాడు. ఈయన మధ్య ప్రదేశ్ కు చెందిన వాడు. మహాభారత్ లో అశ్వత్థామగా మొదట నటించి ఆ తరువాత హిందీలో సర్ఫ్ రోష్ సినిమాతో గుర్తుంపు తెచ్చుకున్నాడు. హిందీతో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ నటించాడు. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాడు. తెలుగులో సైతో మొదలైన ఈయన విలనీ భద్ర, అందరి వాడు, ఛత్రపతి, లక్ష్మి, స్టాలిన్, దేశ ముదురు, యోగి, జగడం, మైసమ్మ ఐపిస్ తదితర సినిమాల్లో చేశాడు.
రాహుల్ దేవ్: రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కొడుకు రాహుల్ దేవ్ బర్మన్. ఈయన మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంటరయ్యాడు. పంజాబీ ఫామిలీకి చెందిన వాడు. మొదట ఛాంపియన్ అనే హిందీ సినిమాలో నటించాడు. ఈ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. తెలుగులో మొదట టక్కరి దొంగలో అడుగు పెట్టాడు. సింహాద్రి, మాస్, అతడు, పౌర్ణమి, తులసి, నాయక్ సినిమాల్లో నటించాడు.
అభిమన్యు సింగ్: ఇతను బాలీవుడ్ 2001లో అడుగు పెట్టాడు. అక్కడ చాలా సినిమాల్లో విలన్ గా చేశాడు. తెలుగులో రక్త చరిత్ర, బెజవాడ, నేను నా రాక్షసి వంటి సినిమాల్లో చేసినప్పటికీ గబ్బర్ సింగ్ లో మాత్రం అందరి దృష్టిలో పడిపోయిన బాడ్ మాన్.
కబీర్ దుహన్ సింగ్: మోడల్ గా ఎంటరై సినిమాల్లోకి జంప్ అయ్యాడు. మొదటి ఆఫర్ గోపీ చంద్ జిల్ సినిమాలో రావడంతోనే అతనికి వెంట వెంటనే ఆఫర్లు వచ్చాయి. తరువాత కిక్ 2 లో కూడా విలన్ గా చేశాడు.
విద్యుత్ జమ్వల్: ఈయన మార్షల్ ఆర్టిస్ట్, ఆర్మీ ఆఫీసర్ కొడుకు. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తరువాత విలన్ రోల్స్ లోకి దిగిపోయాడు. తమిళంలో తుపాకీలో, తెలుగులో శక్తి, ఊసరవెల్లి సినిమాల్లో నటించాడు.
విక్రమ్ సింగ్: బాలీవుడ్ లో గాడ్ ముంబయ్ ఫాదర్ ద్వారా సినిమా కెరీర్ ను మొదలు పెట్టిన విక్రమ్ సింగ్ తెలుగులో రెబెల్, 1 నేనొక్కడినే చిత్రాల్లో నటించాడు.
కెల్లీ డోర్జీ: భుటానీ నటుడు, మోడల్ అయిన కెల్లీ ముంబయిలో సెటిలైపోయాడు. తెలుగులో డాన్ తో ఎంటరయ్యాడు. ద్రోణ, బిల్ల, కేడి, గోలీమార్, భ్రదీనాథ్, దాదా, రెబెల్, బాద్షా, 1 నేనొక్కడినే చిత్రాల్లో నటించాడు.
నికితిన్ ధీర్: తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త విలన్. హిందీలో జోధా అగ్బర్ లో మొదట విలనీగా ఎంట్రీ ఇచ్చాడు. దబాంగ్ 2, చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి హిట్స్ లో నటించి తెలుగులో కిక్ 2, విడుదల కాబోతున్న కంచెలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.
సాయాజీ షిండే: ఈయన చాలా కాలం క్రితమే మన తెలుగులోకి ఎంటరైన బాలీవుడ్ సీనియర్ నటుడు. స్వతహాగా ఈయన మరాఠీ నటుడు. తెలుగులో ఠాగూర్ (2003) తో విలన్ గా ఎంటరయ్యాడు. ఆ తరువాత చిరుత, రాఖీ, దుబాయ్ సీను, కింగ్, చింతకాలయ రవి, అరుంధతి, ఆర్య 2, కిక్, బాద్షా, రభస, రేసు గుర్రం సినిమాల్లో నటించాడు. కేవలం విలన్ గానే కాక కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు.
ముఖేష్ రిషి: ఈయన కూడా మొదట తన కెరీర్ ను మోడల్ గా ప్రారంభించాడు. తెలుగులో ఎక్కువ సినిమాలు నటించిన బాలీవుడ్ విలన్ గా సీనియర్ నటుడుగా చెప్పుకోవచ్చు. ఒక్కడు లాంటి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలు కూడా చేశాడు. తెలుగు ఎంట్రీ గాంఢీవంతో మొదలైంది. మనోహరమ్, నర్సింహ నాయుడు, అధిపతి, ఇంద్ర, ఒక్కడు, సింహాద్రి, పలనాటి బ్రహ్మనాయుడు, నేనున్నాను, బన్నీ, పౌర్ణమి, రచ్చ, బాద్షా, కంత్రి, రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది, రేస్ గుర్రం, శ్రీమంతుడు, లౌక్యం తదితర చిత్రాల్లో నటించాడు.
వీళ్ళే కాక స్వర్గీయ అమ్రిష్ పురి కూడా ఆఖరిపోరాటంలో నటించాడు. ఆ తరువాత జగదేకవీరుడు అతిలోక సుందరి, ఆదిత్య 369 లాంటి చాలా సినిమాల్లో నటించి తెలుగులో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. స్వర్గీయ అమ్జద్ ఖాన్ కూడా కొన్ని తెలుగు సినిమాల్లో నటించాడు. శక్తి కపూర్, ప్రాణ్, గుల్షన్ గ్రోవర్ (క్రిమినల్), పరేష్ రావల్ (క్షణం, క్షణం) లాంటి వాళ్ళను తెలుగులోకి రప్పించినప్పటికీ వాళ్ళు కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి వెనక్కి వెళ్ళి పోయారు.