అఖిల్ తో సినిమా ఎంట్రీ కోసం నాగార్జున చాలా ఆలోచించి చివరికి వివివినాయక్ చేతిలో పెట్టారు. ఇప్పటి వరకూ అక్కినేని ఫామిలీకి ఉన్న ఇమేజ్ అఖిల్ పై పడకుండా ఓ మాస్ కమర్షియల్ సినిమా చేయాలనే ఆలోచనతో కథను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అఖిల్ పోస్టర్స్ చూస్తే మాస్ లుక్ ను బాగా ఎలివేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఫస్ట్ పోస్టర్లోనే విశ్వరూపం చూపాడు. అక్కినేని ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. అయితే ట్యాగ్‌లైన్ ‘ద పవర్ ఆఫ్ జువా’ లో ‘జువా’ ఏంటనే ప్రశ్న చాలా మందిలో ఉదయించింది. దీనికి మీనింగ్ ను నిర్మాత నితిన్ తెలుపుతూ... దక్షిణాఫ్రికాలో ఓ తెగవారు మాట్లాడే స్వాహిలి భాషలోని పదమని చెబుతూ... ‘జువా’ అంటే సూర్యుడు అని అర్థమని చెప్పారు. సో సూర్యుడంతటి పవర్ తో అఖిల్ ఈ చిత్రంలో రాబోతున్నాడన్నపాట. సూర్యుడికి ఈ సినిమాలో అఖిల్ కు ఉన్న సంబంధం సినిమా రిలీజైతే గానీ తెలియదు. కాగా ఈ పోస్టర్ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అందులో తండ్రీ కొడుకులు (అఖిల్-నాగార్జున) కూడా పోస్టర్ పై ట్విట్టర్ ప్రేమను కురిపించుకున్నారు.