మన తెలుగు వారికి బాంబే అమ్మాయిలతో పాటు బాగా నచ్చేవారు మళయాళం కుట్టిలు. ఇప్పటికే నిత్యామీనన్, నయనతార, మాళవిక అయ్యర్, ప్రియమణి వంటీ హీరోయిన్లు స్టార్ హీరోలతో నటించారు. గ్లామర్ నటీమణులంటే ముంబయి నుంచి, నటన కావాలంటే మళయాళం నుంచి హీరోయిన్లను లాక్కొచ్చుకుంటున్నారు మన తెలుగు సినిమా నిర్మాతలు. ఇప్పుడు కొత్తగా మరో టాలెంటెడ్ అమ్మాయి అనుపమ పరమేశ్వర్ ను కూడా తెచ్చేశారండీ... ‘ప్రేమమ్’లో ఈ అమ్మడి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అందుకే తెలుగు రీమేక్ లో అమ్మడినే తీసుకున్నారు. మొదటి సినిమాతోనే యావత్ సౌతిండియా సినిమా దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న ఈ నటికి ప్రస్తుతం తెలుగులో తెగ అవకాశాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ‘అ..ఆ..’లో నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా మళయాల ‘ప్రేమమ్’ సినిమాకు తెలుగు రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. తనకు ఏ సినిమా అయితే క్రేజ్ తెచ్చిపెట్టిందో అదే సినిమాకు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలోనూ నటించే అవకాశాన్ని అనుపమ సొంతం చేసుకుంది. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రవితేజ-వేణు శ్రీరామ్‌ల కాంబినేషన్లో దిల్‌రాజు రూపొందించనున్న మరో సినిమాలోనూ అనుపమ హీరోయిన్గా ఎంపికయ్యారు. భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుందనడంలో సందేహమే లేదు.