ఇండియన్ సినీ హీరోల్లో రజనీ కాంత్ ది ఓ ప్రత్యేక తరహా. ఆయన లైఫ్ స్టైల్, మేనరిజం, సినిమాలు అన్నీ డిఫరెంట్ గానే ఉంటాయి. సాధారణంగా ప్రతి హీరో తాను తెరమీద ఎంత అందంగా కనిపిస్తాడో బయట కూడా అంతే అందంగా కనిపించాలని తాపత్రయ పడతారు. కానీ అందుకు విరుద్ధంగా బయట తానెలా ఉంటాడో అభిమానుల యధాతథంగా చూపించుకుంటారాయన. అప్పుడప్పుడూ ఆయన ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్ళి వస్తుంటారు కూడా. ఇటీవల విడుదలైన లింగా సినిమా ఆయనకు ఇంతకు ముందు ఎన్నడూ లేని అశాంతిని తెచ్చి పెట్టింది. దీంతో ఆయన మళ్ళీ హిమాలయాలకు వెళ్ళారనే టాక్ కూడా వచ్చింది. అయితే కొత్త విషయం ఏమిటంటే లింగా ఫ్లాప్ తో తన తరువాతి సినిమా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు సుందర్ .సి అని టాక్ వినపడుతోంది. ఈయన గతంలో ‘అరుణాచలం’ సినిమా తీసి పెద్ద హిట్ చేశాడు. ఆ సినిమా 18 ఏళ్ళ క్రితం విడుదలైంది. ఇప్పుడు మళ్ళీ ఆ దర్శకునితోనే సినిమా చేయబోతున్నాడట రజనీకాంత్. ఇది పూర్తిగా రజనీ స్టైల్ మాస్ చిత్రంగా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఇంకా కథ గురించి గానీ, మిగతా తారాగణం, నిర్మాతలు ఎవరనేది తెలియరాజలేదు. అఫీషియల్ న్యూస్ వెల్లడించే వరకూ వెయిట్ చేయాల్సిందే.