ఇటీవల ‘మా’ ఎలక్షన్ల ద్వారా ఈ ఇద్దరు నటులూ ఒకే మాట ఒకే బాటగా వార్తల్లో కనిపించారు. కానీ వీరిరువురిదీ 30 ఏళ్ళ అనుబంధం. ఇప్పుడు వీరిద్దరూ కలిపి ఒక కొత్త బ్యానర్ ను స్థాపించబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజాలు కలిసి టీవి మరియు పిల్మ్ ప్రొడక్షన్స్ ను.. రాజా & రాజా క్రియేషన్స్ (ఆర్&ఆర్ క్రియేషన్స్) పేరిట మొదలు పెట్టబోతున్నారు. అందుకు మే 29 న ముహూర్త కార్యక్రమం జరుపుకుంది. ఈ సందర్భంగా రాజా & రాజా క్రియేషన్స్ గురించి మాట్లాడుతూ ‘‘రాజా & రాజా క్రియేషన్స్ లో ముఖ్యంగా టీవీ కార్య క్రమాలతో పాటు సమాంతరంగా సినిమాలను కూడా నిర్మించబోతున్నాం. త్వరలోనే 'ఈ' టీవీలో ఓ ప్రొగ్రామ్ ను మా బేనర్ లో మొదలు పెట్టబోతున్నాం. అలాగే మిగతా అన్ని ఛానల్స్ లోనూ మరిన్ని మంచి ప్రొగ్రాములు అందించబోతున్నాం. రాబోయే కాలంలో మా బ్యానర్ పేరు నిలబెట్టే విధంగా మంచి మంచి టీవీ కార్యక్రమాలతో పాటు సినిమాలను నిర్మించడమే మా ధ్యేయం. మా ఇద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్నరాజా & రాజా క్రియేషన్స్ విజయ పథంలో సాగాలని.. అందుకు మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా’’మన్నారు. రాజా & రాజా క్రియేషన్స్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా రాజేంద్ర ప్రసాద్ తనయుడు బాలాజీ, శివాజీ రాజా అల్లుడు కిరణ్ కుమార్ వర్మ వ్యవహరించనున్నారు. ఈ ముహూర్తపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కైకాల సత్యనారాయణ, నాగి రెడ్డి-చక్రపాణిలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజాలను ఆశీర్వదించారు. అలాగే ప్రముఖ దర్శకుడు ఎస్.వి.క్రిష్ణా రెడ్డితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖులు ఈ ముహూర్త కార్యక్రమానికి విచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.