చిరంజీవి నటించబోయే 150వ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో తాము ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టబోతున్నట్టు తెలిపారు. హనుమంతుడి బొమ్మతో పేరులో కొణిదెల వచ్చేలా ఈ బ్యానర్ నేమ్ ఉంటుందట. అయితే రాంచరణ్ తన మొదటి సినిమాను మంచి సక్సెస్ చేసేందుకు చాలా ప్లాన్లే వేస్తున్నారు. ఈ సినిమా మెగాస్టార్ జీవితంలో ప్రత్యేక సినిమాగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే కథ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతకాలం ఈ సినిమా గురించిన విషయాలు బయటకు చెప్పుకోవడం ఇష్టపడని రామ్ చరణ్ తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. 150వ సినిమాలో తనతో పాటు మెగా ఫ్యామిలీ(పవన్, బన్నీ తదితరులు) మొత్తం ఉంటుందని తెలిపారు. డైరెక్టర్, స్టోరీ ఇంకా ఫైనల్ కానప్పటికీ అందరూ కలిసి ఏదో ఒక సాంగులో కలిసి స్టెప్స్ వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు రామ్ చరణ్ చెప్పుకున్నాడు. ‘నాన్న సినిమాలో నేను ఓ ఐటం చేస్తున్నాను. ఇన్ ఫాక్ట్ మేమంతా కూడా ఇందులో ఐటం చేస్తున్నాం...సినిమాలో నాన్న ఒక్కడే హీరో' అని రామ్ చరణ్ తెలిపారు. ఒక వేళ ఇందుకు మీ నాన్న ఒప్పుకోకపోతే అనే ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ...‘ఇది నేను నిర్మిస్తున్న సినిమా. నేను నా సినిమాకు మార్కెట్ పెంచుకోవడానికి అది అవసరం. అందుకోసం ఏదైనా చేస్తాను. ఆ విషయాలు నాన్న ఎలా చెబుతారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తారు' అంటూ రామ్ చరణ్ అప్పుడే నిర్మాత దర్పం కనబరిచాడు. మంచి కథ కోసం వెతుకుతున్నామనీ, కథ దొరికితే సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో... ఎప్పుడు ముగుస్తుందో గానీ... అందరూ కలిసి డాన్స్ చేస్తామంటే మాత్రం ఆ పాట కోసమైనా మెగా పవర్ అభిమానులు క్యూ కట్టడం ఖాయం.