మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల'ల కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం గురువారం (మార్చి 5) ఉదయం నిర్మాణ సంస్థ కార్యాలయంలో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహర్తపు సన్నివేశంగా దేవుని ఫోటోలపై చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ " చాలా గ్యాప్ తర్వాత రచయితలు కోన-మోహన్ కాంబినేషన్ చిత్రం రూపొందించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిర్మాత దానయ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఇక నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ " నాయక్ తర్వాత తిరిగి రామ్ చరణ్ తో సినిమా చెయ్యటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. "శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ త్రయం కలిసి ఈ సినిమాకి అద్భుతమైన స్రిప్ట్ ఇచ్చారని అన్నారు. 'ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో చరణ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఇప్పటికే ఎంపిక చేయగా, మిగతా తారగణం ఎంపిక చేయాల్సి ఉంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య చిత్రీకరించే సన్నివేశాలతో ఈ నెల 16 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.