తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ ఆణిముత్యం లాంటి నటుడు శ్రీహరి. ఆయనకు ప్రాణమైన సినిమాల్నీ, మనల్ని వదిలిపెట్టి అప్పుడే రెండేళ్ళవుతోంది. ఆయన మనల్ని విడిచినా... అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు... నేనెక్కడికీ వెళ్ళ లేదు... అంటూ అప్పుడప్పుడూ బుల్లితెరమీద ఏదో ఒక సినిమాలో దర్శనమిస్తూనే ఉన్నాడు.
ఆయన సినిమా ఎంట్రీ విలనిజంతోనే ప్రారంభించినా... విలనిజాన్ని ఎంత భయంకరంగా ప్రదర్శించాడో... క్యారెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా కూడా అంతేబాగా నటించి మెప్పించాడు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనే చిత్రంలో హీరోయిన్ అన్నయ్యగా శ్రీహరి చూపించిన పెర్ఫార్మెన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఆయనకు ఫిదా అయిపోయారు. చెల్లెల్లి ఇంతలా ప్రేమించే అన్నయ్య మాకుంటే ఎంత బాగుండు అనుకున్నారు అమ్మాయిలు. అందుకే ఈ సినిమాకు బెస్ట్ సపోర్ట్ యాక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు రెండూ దక్కాయి ఆయనకు. 1986లో (బ్రహ్మనాయుడు) మొదలు పెట్టిన ఆయన సినీ జీవితం 2013 వరకూ విరామం లేకుండా నడిచింది. శ్రీహరి అనగానే గుర్తుకు వచ్చే మరో పాత్ర మగధీరలో షేర్ ఖాన్. అందులో ఆయన నటించిన రెండు క్యారెక్టర్లూ ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయ్యాయంటే... హీరోతో సమానరమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి ఆయనకు. ఇక పోలీస్ ఆఫీసర్ గా వరుసగా చేసిన పోలీస్, విజయరామరాజు, బలరామ్ అన్నీ హిట్ సినిమాలు. భద్రాచలంలో ఓ అథ్లెట్ గా నటించి... ఎందరికో స్ఫూర్తి కలిగించారు. ఆయన కెరీర్ లో ఇది ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో ఉన్న‘ఒకటే జననం ఒకటే మరణం’ అనే ఇన్ స్పిరేషన్ పాట... ప్రతి ఒక్కరినీ ముందుకు నడిపిస్తున్నట్టుంటుంది ఈనాటికీ...
శ్రీహరిని అభిమానులు ‘రియల్ స్టార్’ అని ముద్దుగా ఎందుకు పిలుచుకుంటారంటే... ఈయన కెరీర్ ప్రారంభించింది స్టంట్ ఫైటర్, ఈయన జిమ్నాస్టిక్స్ లో నేషనల్ లెవెల్ అథ్లెట్. అంటే ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉండడమే కాదు... ఆపదలో ఉన్న ప్రతి వారినీ ఆదుకునే మంచి మనసున్న వాడు శ్రీహరి అందుకే అభిమానులు ఆయనను రియల్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇక శ్రీహరికి సినిమాలకు ముందు ఇన్స్ పెక్టర్ గా, రైల్వే ఆఫీసర్ గా జాబ్ ఆఫర్లు వచ్చినా, సినిమా మీదున్న అభిమానంతో ఆ రెండు ఉద్యోగాలను కాదనుకున్నాడు.
శ్రీహరి మహా నటుడే కాదు గొప్ప మానవతా వాది కూడా ఆయన కాల్ షీట్స్ కోసం ఎందరో వేచివున్నా తన ఉన్నతికి కారకులైన వారిని ఎప్పుడూ మరిచిపోకుండా వారిని ప్రోత్సహించిన మంచి మనిషి. తన కో ఆర్టిస్టు డిస్కో శాంతిని పెళ్ళి చేసుకుని, చక్కని కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నో సినిమాల్లో విలన్ గా కనిపించిన ఈ నటుడికి స్త్రీల పట్ల గొప్ప గౌరవం. తల్లిని ఎంతలా ప్రేమిస్తాడో... భార్యకూ అంతే గౌరవం ఇచ్చి ప్రేమించాడు. ఇద్దరు కుమారుల తరువాత పుట్టిన తన కూతురు అక్షర 4 నెలలకే మృతి చెందడంతో ఆమె పేరు అక్షర ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలకు పూనుకున్నాడు. సినిమా తారలంతా ఈ రోజు ఊరిని దత్తత తీసుకునే కార్యక్రమంలో తలమునకలవుతుంటే శ్రీహరి మేడ్చల్ లో నాలుగు ఊర్లను దత్తత తీసుకుని అభివృద్ధి చేసే పనిని ఎప్పుడో చేపట్టాడు. అందుకే ఆయన ప్రజల మనసులో రియల్ స్టార్ అయ్యాడు. ఏ హీరోకు దక్కని అరుదైన టాగ్ తగిలించుకున్న ఈ నటుడు, మానవతావాది లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నీహార్ ఆన్ లైన్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.