గుణశేఖర్ చేసిన తొమ్మిదేళ్ల కృషి ఫలితం రుద్రమదేవి. ఈ సినిమా కోసం దాదాపు 70 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట గుణశేఖర్. గుణా టీమ్ వర్క్స్ పతాకంపై ఈ సినిమాను గుణశేఖర్ నిర్మించారు. రాగిణి గుణ సమర్పించారు. ఆయన కుమార్తెలు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. టైటిల్ పాత్రలో అనుష్క, ఆమెకు జంటగా రానా, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. ఇందులో రానా రొమాంటిక్ యాంగిల్‌ని చూడొచ్చని, దాదాపు 70కోట్ల వ్యయంతో సినిమాను రూపొందించామని, టీజర్లో విడుదలైన `నేను తెలుగు భాష లెక్క. ఆడా ఉంటా, ఈడా ఉంటా` అనే డైలాగ్ చాలా పాపులర్ అయిందనీ గుణశేఖర్ తెలిపారు. ఈ సినిమాలోని పాటలను అటు వైజాగ్‌లోనూ, ఇటు విజయవాడలోనూ విడుదల చేశారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన సినిమా ఇది.