అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన గోవాలో నటనిర్మాత సచిన్ "ప్లానెట్ హాలీవుడ్ బీచ్ రిసార్ట్" ను ప్రతిష్టాత్మకంగా నేడు ప్రారంభిస్తున్నారు. గ్రీస్, మయామి వంటి ప్రదేశాల్లో ఉండే అత్యంత విలాసవంతమైన వసతులతో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ బీచ్ రిసార్ట్ రూపుదిద్దుకుంది. దీనికి కింగ్ ఖాన్ షారూఖ్ సతీమణి గౌరీఖాన్ స్వయంగా ఫర్నీచర్ ఎంపిక చేయడమే కాకుండా, బార్, లాబీలను డిజైన్ చేసారు. దేశవిదేశాలకు చెందిన కుబేరులు, ప్రముఖులు ప్రైవేట్ జెట్స్ లో ఈ బీచ్ రిసార్ట్ కు చేరుకుని, వినోద కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఆ వినోదం మర్నాడు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని కార్యక్రమ నిర్వాహకులు భావనా పాండే, నందిత మహ్తానీలు తెలిపారు. 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ బీచ్ రిసార్ట్ లోని గదులను హాలీవుడ్ హిట్ చిత్రాల స్ఫూర్తితో విభిన్న డిజైన్లతో రూపొందించారు. లెగ్ మసాజులు, బ్యూటీ సెలూన్లు, లిమొసైన్ కార్ సర్వీసులు వంటి ఎన్నో ఆకర్షణలు ఈ రిసార్ట్ ను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి.
"మూడేళ్ల కృషితో ఈ రిసార్ట్ ను ప్రారంభిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉంటే గ్రీస్, మయామీల్లో ఉన్నట్టే" అని ప్లానెట్ హాలీవుడ్ బీచ్ రిసార్ట్ యజమాని సచిన్ అన్నారు. కనుక ఇకనుంచి సంపన్న సినీ దిగ్గజాల హాలీడే స్పాట్ "ప్లానెట్ హాలీవుడ్ బీచ్ రిసార్ట్" అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.