తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో హంసవాహిని టాకీస్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన చిత్రం 'సాహసం సేయరా డింభకా'. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఆడియో విడుదల చేయనున్నారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్, ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగింది. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, వి.సముద్ర, డిఎస్ రావు, బెల్లంకొండ సురేష్ తదితరులతో పాటు చిత్ర బృంద సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలు హంసవాహిని టాకీస్ బ్యానర్ ఆవిష్కరించారు. వి.సముద్ర, డిఎస్ రావులు మూవీ ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు. బెల్లంకొండ సురేష్ ధియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. "రోజు రోజుకు ప్రేక్షకుల అభిరుచి మారుతుంది. కొత్త ప్రయోగాలకు కామెడీ జత చేస్తే ఆ చిత్రం విజయం సాధిస్తుంది. భయపెడుతూ నవ్వించిన ప్రేమకథా చిత్రమ్, గంగ చక్కని విజయాలు సాధించాయి. కిరణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ప్రయోగం చేశారు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. విజయం కోసం ఎదురుచూస్తూ ప్రయోగాలు చేస్తున్నాడు శ్రీ. వీరందరూ ఈచిత్రంతో పెద్ద విజయం అందుకోవాలని కోరుతున్నాను" అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. "మంచి టైటిల్. ట్రైలర్ బాగుంది. కొత్త నిర్మాణ సంస్థ హంసవాహిని టాకీస్ పతాకంపై ప్రేక్షకులు ఎం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి చిత్ర బృందం కష్టపడింది. చిత్రం విజయం సాధించాలి. టీం అందరికి అల్ ది బెస్ట్" అన్నారు. సముద్ర మాట్లాడుతూ.. "శ్రీ, కిరణ్, ఎంఎస్ రెడ్డి, శ్రీ వసంత్ చిత్రానికి పని చేసిన అందరూ నాకు మంచి స్నేహితులు. షూటింగ్ పూర్తయిన తర్వాత మరికొన్ని కరెక్షన్స్ చేస్తే బాగుంటుందని మళ్లీ షూటింగ్ చేశారు. నేను చిత్రం చూశాను. వంద శాతం రూపాయికి రూపాయి తెచ్చే సినిమా. కిరణ్ మారుతి వద్ద సహాయ దర్శకుడిగా ఉన్నప్పటి నుండి తెలుసు. చిత్రాన్ని బాగా తెరకెక్కించాడు. అతనికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుతున్నాను. వసంత్ మంచి సంగీతం, నేపధ్య సంగీతం అందించారు" అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. "కొత్త నిర్మాత కిరణ్ తొలిప్రయత్నంగా తీసిన ఈ సాహసం సేయరా డింభకా చిత్రం మా సంస్థ నుండి వచ్చిన ముని, కాంచన, గంగ తరహాలో మంచి విజయం సాధించాలి. దర్శకనిర్మాతలకు పేరు, డబ్బు తీసుకురావాలి" అన్నారు. నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. "చిన్న చిత్రమైనా పెద్ద టెక్నీషియన్లు పని చేశారు. కిరణ్ లో టాలెంట్, కసి నాకు తెలుసు. కథ వినకుండా అతనిపై నమ్మకంతో అవకాశం ఇచ్చాను. దానికి తగ్గట్టు మంచి చిత్రం తీశాడు. కొత్త దర్శకులకు కేరాఫ్ అడ్రస్ గా మా సంస్థ నిలుస్తుందని తెలియజేస్తున్నాను" అన్నారు. దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ.. "టైటిల్ చెప్పగానే కథ వినకుండా నిర్మాత అవకాశం ఇచ్చారు. నమ్మకం వమ్ము చేయలేదు. 200% విజయం సాధిస్తుంది" అన్నారు. శ్రీ మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీలో ఎంటర్ అవడానికి కారణం కిరణ్. ప్రతి కథ నాకు వినిపిస్తాడు. ఈ కథ చెప్పగానే నువ్వే దర్శకత్వం చేయాలని పట్టుబట్టాను. చిత్రం ప్రారంభించే ముందు సాహసం చేస్తున్నామని డిసైడ్ అయ్యి 'సాహసం సేయరా డింభకా' అని టైటిల్ పెట్టాం. హమీదా, సమత బాగా నటించారు. ఏడాదిన్నర తర్వాత నేను నటిస్తున్న చిత్రమిది. పకా విజయం సాధిస్తుంది" అన్నారు.