సల్మాన్ ఖాన్ నల్ల జింకను వేటాడిన కేసు ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడీ కథను సినిమాగా తీయబోతున్నారట. రాజస్థాన్ లో నల్ల జింకను వేటాడిన పాపానికి సల్మాన్ 19 ఏళ్ళుగా ఇంకా కోర్టు గడప తొక్కుతూనే ఉన్నాడు. ఈ కేసునే సినిమాగా తీసేందుకు నిర్మాత రంజిత్‌శర్మ రెడీ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి నాడు సల్మాన్ ఖాన్ జైల్లో 72 గంటలు ఉండగా అతనితోబాటు జైల్లో ఉన్న మహేష్‌సైనీ కూడా ఈ మూవీలో నటించబోతున్నాడు. ముంబైలోని ఫిల్మిస్తాన్ స్టూడియోలో సోమవారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. త్వరలో జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో కూడా తాము షూటింగ్ జరుపుతామని రంజిత్ తెలిపారు. 2006 ఫిబ్రవరిలో రాజస్థాన్ లోని రెండు ప్రాంతాల్లో నల్ల జింక లను సల్మాన్ ఖాన్ మరికొందరు కలిసి వేటాడారు. ఆ కేసులో సల్మాన్‌కు జైలుశిక్ష పడడం, దానిని సవాలు చేస్తూ ఈ నటుడు కోర్టుకెక్కడం, అతనికి బెయిల్ లభించడం తెలిసిందే. ఈ కేసులో ఈనెల 25న కోర్టు తీర్పు ప్రకటించవచ్చునని, అదే రోజున తాము కోర్టు సీన్ చిత్రీకరిస్తామని రంజిత్ తెలిపారు. ఈ సినిమాలో సల్మాన్ డ్రైవర్ హరీష్ దులానీ కూడా నటించవచ్చునని, నాడు సల్మాన్ వేటాడేందుకు వాడిన జిప్సీ వాహనాన్నే తాము ఇందులో వినియోగిస్తామని ఆయన చెప్పారు. సల్మాన్ ని నిందితుడిగా కోర్టు చిత్రీకరించినా ఆయన ఇమేజ్ కు ఏ మాత్రం భంగం కలగకుండా ఈ చిత్రాన్ని తీస్తామని నిర్మాత రంజిత్ శర్మ తెలిపారు. ఇంతకు ఈ చిత్రానికి ‘ఖైదీ నెంబర్ 210’ టైటిల్ ను ఫిక్స్ చేశారట.