పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకరత్న దాసరి వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా అని అప్పట్లో సంచలనం రేగింది. దాసరికి మెగా ఫ్యామిలీకి పరోక్ష మాటల యుద్ధం ఉందని, వారికి పొసగదనే విషయం అందరికీ తెలుసు. అలాంటిది దాసరి పవన్ తో సినిమా అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఇందుకోసం అప్పట్లో స్వయానా పవన్ కళ్యాణే దాసరి దగ్గరికి వెళ్లి మరీ సినిమా కోసం ప్రపోజల్ పెట్టాడని వార్తలు గుప్పుమన్నాయి. ముందు గోపాల గోపాల దర్శకుడు డాలీ పేరు, ఆ తర్వాత త్రివిక్రమ్, మధ్యలో కొరటాల ఆపై దాసరియే స్వయంగా ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని గాసిప్స్ షికారు చేశాయి. ఆ సమయంలోనే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు వర్క్ మొదలైందనే వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఈ విషయంపై ఎక్కడా సందడి కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాసరి నారాయణరావు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను సంపత్ నందికి అప్పగించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు గురించి అటు పవన్ కల్యాణ్ తో.. ఇటు సంపత్ నందితో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ తో మిస్ అవకాశం మిస్సయినప్పటికీ రచ్చ .. బెంగాల్ టైగర్ సినిమాలతో హిట్ కొట్టి, మాస్ ఆడియన్స్ పల్స్ పట్టేశాడనే నమ్మకంతోనే ఈ ప్రాజెక్టును సంపత్ కి అప్పజెప్పబోతున్నారనే టాక్. ఈ విషయాన్ని గురించి త్వరలో దాసరి నారాయణరావు మీడియా సమావేశం నిర్వహించి ఓ అధికార ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.