మన తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకోదగిన నటుల్లో రమ్యకృష్ణ ప్రధానంగా చెప్పుకోవచ్చుననడంలో అతిశయోక్తి కాదేమో... ఎందుకంటే అటు పవర్ ఫుల్ రోల్స్ లోనూ, ఉదాత్తమైన పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోయే నటి. ఇటు గ్లామర్ పాత్రల్లోనూ మెప్పించగలరు... అమ్మోరుగానూ ఒప్పించగలదు. ఇప్పుడు ఈమె ఓ క్రికెటర్ కు తల్లిగా నటించబోతోందట. తల్లి పాత్రలంటే ఏముంది మామూలే కదా అనుకోవచ్చు... కానీ ఏ ప్రత్యేకతా లేనిదే రమ్యకృష్ణ కూడా ఒప్పుకోదు కదా! క్రికెటర్ శ్రీశాంత్ ఎప్పటినుంచో సినిమాల్లో నటించాలని ఉబలాట పడుతున్నాడు. అది ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చిందట. ఆయన హీరోగా నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇందులో ఓ కీలకమైన పాత్ర హీరో తల్లి. ఇందుకోసం రమ్యకృష్ణని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ తెరకెక్కనున్న ఈ మూవీలో క్రికెట్ కు సంబంధించిన కథ ఉంటుందంటున్నారు. ఇందులో రమ్యకృష్ణ ను ఎంపిక చేయడానికి గల కారణం శ్రీశాంత్ కు మొదటి క్రికెట్ గురువు తల్లేనట. అందుకే కేరక్టర్ కు రమ్యకృష్ణ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సానా యాదిరెడ్డి. ఈయన తీసింది తక్కువ సినిమాలే అయినా అన్నీ సక్సెస్ చిత్రాలే. క్రికెట్ కాన్సెప్ట్ తో ఎంచుకున్న ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్న సానా యాదిరెడ్డి ఈ చిత్రంలో శ్రీశాంత్ రియల్ లైఫ్ మ్యాచ్ ఫిక్సింగ్ పాయింట్ తీసుకుంటారా లేదా? అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉదయించే ప్రశ్న.