విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేసుకుపోతున్న నిఖిల్ నాలుగవ సారి కూడా కోనవెంకట్ సమర్పణలో ఓ వెరైటీతో కథతో తెరమీదకు రాబోతున్నాడు. గోల్డెన్ జూబ్లీ సినిమా పేరును తమ సినిమాకు పెట్టేసుకుని సక్సెస్ సాధించాలనుకుంటున్నారు శంకరాభరణం సినిమా బృందం. నిఖిల్ కు జతగా నందిత నటిస్తోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ‘గీతాంజలి’ వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ నెల 30న ఆడియోను విడుదల చేసి దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ- ”ఇటీవల పవన్ కల్యాణ్ గారు విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రకథ గురించి చెప్పాలంటే.. యూఎస్ కి చెందిన అత్యంత సంపన్నుడి కొడుకు హీరో నిఖిల్. ఈ ప్రపంచంలో సుఖపడేవాళ్లు, కష్టపడి పనిచేసేవాళ్లు.. ఈ రెండు జాతులే ఉంటాయన్నది హీరో నమ్మకం. తాను సుఖపడటానికే పుట్టానన్నది అతని ఫీలింగ్. అలాంటి అతను ఓ పని మీద ఇండియా వచ్చి, అనుకోకుండా కష్టాల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడనే కథాంశంతో సినిమా సాగుతుంది. ఇందులో అంజలి స్పెషల్ క్యారెక్టర్ చేసింది. సుమన్, సితార, రావు రమేశ్, సప్తగిరి.. ఇలా మొత్తం 40 మంది ప్రముఖ నటీనటులు నటించారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించాం. హారర్ కి కామెడీ మిక్స్ చేసి, మేం తీసిన ‘గీతాంజలి’ ఘనవిజయం సాధించింది. ఇప్పడు క్రైమ్ లో కామెడీ మిక్స్ చేసి ‘శంకరాభరణం’ చేశాం. ఇంతకుముందు క్రైమ్ కామెడీ సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్. ఈ సినిమాలో సెట్స్ ఉపయోగించలేదు. టాకీ మాత్రమే కాదు… చివరికి పాటలను కూడా సహజమైన లొకేషన్స్ లోనే తీశాం. బీహార్ లోని డేంజరస్ లొకేషన్స్ లో, పుణేకి దగ్గరలో ఎవరూ చేయని లొకేషన్స్ లో, యూఎస్ లో కొంత భాగం చిత్రీకరించాం. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి. ప్రవీణ్ లక్కరాజ మంచి స్వరాలందించారు. ఈ నెల 30న పాటలను విడుదల చేయబోతున్నాం. దీపావళికి సినిమాని విడుదల చేస్తాం” అని వివరించారు.