షూటింగ్ కోసం అక్కడికెళ్ళాం... ఇక్కడికెళ్ళాం... అంత రిస్క్ చేశాం... ఇంత రిస్క్ చేశాం... అంటూ ఈ మధ్య సినిమా వాళ్ళు తెగ చెప్పేసుకుంటున్నారు. నిజమే వాళ్ళు రిస్కులే చేయొచ్చు... కానీ తెరమీద వాళ్ళు చేసినంత రిస్క్ కనిపిస్తుందా? ఏమో... తేజ తన కొత్త సినిమా షూటింగ్ కోసం విష సర్పాలు ఉన్న అడవి ప్రాంతాలకు వెళ్ళాడట ఆ మధ్య. ఎందుకైనా మంచిదని తమతో పాము కాటు మందులు తీసుకు వెళ్ళారట.... ఇప్పుడు కోన వెంకట్ కూడా అదే రిస్క్ చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. తను కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన శంకరాభరణం కోసం మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళారు. ఇది కూడా మనుషులు వెళ్ళడానికి సాహసం చేయని ప్రదేశమేనట. క్రైమ్ కామెడీ కాబట్టి అలాంటి లొకేషన్లు వెతుక్కున్నామంటున్నాడు కోన. ఏమిటో మామూలు అడవులు ఇక్కడ కనిపించవా? వాళ్ళు చేసే రిస్క్ తెరమీద ఏం కనిపిస్తుంది? ఈ నెల 25 వరకూ అక్కడ షూటింగ్ జరుపుకుని తరువాత యూనిట్ అంతా హైదరాబాద్ వస్తారట. ఈ సినిమాలో నిఖిల్, నందిత జంటగా నటిస్తుండగా, అంజలి దొంగల ముఠాకు నాయకురాలుగా నటిస్తోంది. ఉదయ్ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తీస్తున్నాడు.