ఒకే థియేటర్ లో సంవత్సరం పాటు నడిచిన సినిమాల్లో ‘షోలే’ మొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. ఇది సంవత్సరం కాదు ఒక థియేటర్ లో ఏకంగా 5 సంవత్సరాలకు పైగా ఆడింది. భారతీయ సినిమా చరిత్రలో ఈ చిత్రానిది ప్రత్యేక స్థానం. షోలే 1975లో విడుదలై సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రాన్ని పాకిస్థాన్ లో విడుదల చేయడం అనేది తాజా వార్త. పాకిస్థాన్ లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న నదీమ్ మండ్వీ వాలా ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆ మధ్య 3డిలోకి మార్చిన సంగతి తెలిసిందే. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి, అమ్జద్ ఖాన్ తదితర నటుటు ముఖ్య పాత్రల్లో ఎవరికి వారే అదరహో అనే విధంగా నటించారు. ఈ మల్టీస్టారర్ సినిమా ద్వారానే అమితాబ్ బచ్చన్ కెరీర్ కు బలమైన పునాది పడింది. ఈ చిత్రాన్ని మించిన మరో చిత్రం ఇప్పటి వరకూ రాలేదనే చెప్పాలి. 40 ఏళ్ల కిందటే ఈ సినిమాకు రూ. 3 కోట్లు వెచ్చించి తీశారట. ఈ బడ్జెట్ ఆ సమయంలో చాలా పెద్ద మొత్తమనే చెప్పాలి. దీన్ని తెర మీదకు తెచ్చేందుకు రెండున్నర సంవత్సరాలు శ్రమించారట. రిలీజైన మొదటి రెండు వారాల్లో సినిమా చూసేందుకు జనాలు ముందుకు రాక పోవడంతో సినిమా ప్లాప్ అని అంతా నిరుత్సాహ పడ్డారు. ఆ తరువాత బ్లాక్ బస్టర్ అయ్యింది. ముంబైలోని మినర్వా థియేటర్ లో షోలే ఏకంగా 286 వారాలు(5 సంవత్సరాలపైనే) నడిచి రికార్డు సృష్టించింది. ఒక సక్సెస్ సినిమాను అనుకరిస్తూ తీయడం అప్పుడూ మామూలే... ఇలాంటి కథలతో అనేక సినిమాలు వచ్చినప్పటికీ అవి నిలవలేక పోయాయి. షోలే చిత్రీకరణ, సన్నివేశాలు, పాత్రల ఎంపిక, పాటలు, సంగీతం అన్ని భిన్నంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకతలు. అందువల్లే ఇప్పటికీ ఆదరణ తగ్గని ఈ సినిమాను పాకిస్తానీయులకూ చూపించబోతున్నారు.