మన తెలుగు సినీ చరిత్రలో సంచలన ప్రేమ సినిమా అంటే దేవ దాసు అనే చెప్పాలి. ఎన్ని ప్రేమ సినిమాలు వచ్చినా అవన్నీ దేవ దాసు తరువాతే... ఈ సినిమాకు ఆజ్యులు నాగేశ్వర్ రావుగారనే చెపుతారు. ప్రేమలో ఫెయిలయిన వారిని ఎవరైనా ‘దేవదాసు’తో పోల్చుతారు తప్ప మరొకటి వాడరు అంటే ఇది ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిందో అర్థమైపోతుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు 62 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1953 జూన్ 26న విడుదలై ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలకు ఆజ్యం పోసింది కూడా ఈ సినిమానే. వాస్తవానికి ‘దేవదాసు' మన కథ కాదు. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన దేవదాసు నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవదాసు నవలను తెలుగులో చక్రపాణి అనువదించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో డిఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శరత్ సృష్టించిన గొప్ప పాత్ర నాగేశ్వరరావు చెయ్యడమేమిటని తొలుత విమర్శలు వచ్చాయి. అదే విధంగా పార్వతి పాత్రకు సావిత్రిని తీసుకోవడంపై రాఘవయ్య ఈ సినిమాకి దర్శకుడిగా సరిపోడు అంటూ విమర్శలు వచ్చాయి. ఎవరెన్ని మాటలన్నా, నష్టపోతారని భయపెట్టినా మొండిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయనంత ఛాలెంజ్ గా తీసుకోబట్టే ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా తరువాత ఇలాంటి ప్రేమ కథలు పుంకాను పుంఖాలుగా వచ్చినా ఈ సినిమాను మాత్రం ఏదీ బీట్ చేయలేకపోయింది. ఇంతెందుకు 1953లో విడుదలైన ఈ సినిమాను యథాతథంగా 1974లో అంటే దాదాపు 21 ఏళ్ళ తరువాత కృష్ణ, విజయనిర్మల దేవదాసును నిర్మించారు. అయితే కృష్ణ సినిమా 50రోజులు ఆడితే, అదే సమయంలో మళ్ళీ విడుదలైన నాగేశ్వరరావు దేవదాసు 200 రోజులు ఆడిందంటే... ఈ సినిమా ఆల్ టైమ్ హిట్ అని అర్థమైపోయింది. ఈ చిత్రాన్ని అన్ని భారతీయ భాషలలో కలసి దాదాపు 10 సార్లు విడుదల అయినా నాగేశ్వరరావు దేవదాసుకు వచ్చినంత పేరు మరే దేవదాసు చిత్రానికీ రాలేదు. 1955లో హిందీలో దిలీప్ కుమార్, వైజయంతిమాల, సుచిత్రాసేన్‌లతో మరొక దేవదాసు వచ్చింది. 2002 లో మళ్ళీ హిందీలో షారుక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్‌లతో ఇదే కథ సినిమాగా వచ్చింది.
1937లో హిందీలో పి.సి.బారువా తొలిసారిగా కె.ఎల్.సైగల్, జమునలతో ‘దేవదాసు' చిత్రాన్ని నిర్మించాడు. అదే సంవత్సరంలో తమిళంలోనూ సి.వి.రావు నటుడు, దర్శకుడుగా దేవదాసు సినిమా వెలువడింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఆణిముత్యాలే... "పల్లెకుపోదాం.. పారును చూద్దాం చలోచలో..", "అంతా భ్రాంతియేనా జీవితాన వెలిగింతేనా...", "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్...", "జగమే మాయ బ్రతుకే మాయ.." పాటలన్నీ రీమిక్స్ చేస్తూ అడపాదడపా సినిమాల్లో వాడుకుంటున్నారు. ఈ చిత్రానికి సీనియర్ సముద్రాల మాటలు, పాటలు ఆల్ టైమ్ హిట్స్.