రూప్ కీ రాణి శ్రీదేవి పాత్ర ఏదైతేనేమి ఆమెను మాత్రమే చూడ్డానికి వెళ్ళే సినిమా అభిమానులు ఎంతో మంది. అందుకే ఇలా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు కావడమే ఆలస్యం ఒకదాని తరువాత ఒకటిగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. శ్రీదేవి ఇప్పుడు తమిళంలో ‘పులి’ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలుసు. తమిళ సినిమానే అయినా, శ్రీదేవిని చూడ్డానికి మన తెలుగు వాళ్ళూ ఆ తమిళ సినిమా చూడ్డానికీ రెడీ అయిపోయారు. అందులో శ్రీదేవి ఓ మహారాణి పాత్రలో కనిపిస్తుందట. ఈ అతిలోక సుందరిని ఓ మహారాణిలా చూడ్డానికి మరింత ఇష్టపడతారు మన తెలుగు వాళ్ళు. శ్రీదేవి ఈ సినిమా తరువాత మదర్ అనే హిందీ సినిమాకూ డేట్స్ ఇచ్చేసిందట. ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే ప్రభాస్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో హీరో తల్లి పాత్రకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తల్లి పాత్రలు చేయని శ్రీదేవి ప్రభాస్ తల్లి పాత్రకు ఒప్పుకోవడం నమ్మశక్యం కాకపోయినా పాత్ర చాలా ముఖ్యమైనదనీ, అందులో ఈ తల్లి పాత్రకు 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిజా నిజాలేమిటో అఫీషియల్ వార్త వెలువడే వరకూ వెయిట్ చేయాల్సిందే.