ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో మొదలైంది యువీ క్రియేషన్స్. ఈ సంస్థ రూపొందించిన రెండో సినిమా రన్ రాజా రన్. ఈ సినిమా దర్శకుడు సుజీత్. అతని దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ సంస్థ తన తదుపరి సినిమాను ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం శ్రీదేవిని యువీ క్రియేషన్స్ సంప్రదించారట. ఆమె నో అని చెప్పిందట. దాంతో రూ.2కోట్లు కూడా ఆఫర్ చేశారట.అయినా నో అని చెప్పిందట. ప్రభాస్ విషయంలో ఆమె నో చెప్పడం ఇది తొలి సారి కాదు. రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమాలో రాజమాత పాత్ర కోసం ముందు ఆమెనే అడిగారట. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఈసారి అయినా ఒప్పుకుంటుందేమోనని సంప్రదించారు. ఫలితం శూన్యం. ఇదిలా ఉండగా తన తాజా సినిమాలో హీరో అమ్మ పాత్రకు పెద్ద ప్రాముఖ్యత ఏమీ లేదని అంటున్నారు సుజీత్. శ్రీదేవిని సంప్రదించిన మాటల్లో వాస్తవం లేదనీ చెబుతున్నారు. ఓ వైపు తమిళంలో విజయ్ నటిస్తున్న పులి సినిమాలో హన్సిక తల్లి పాత్రలో నటిస్తున్న శ్రీదేవి తెలుగులో మాత్రం నో చెప్పడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది.