హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగింది. ఈ వేడుకకు దర్శక రత్న దాసరి నారాయణ రావు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నట కిరీటి రాజేంద్రప్రసాద్, హీరో ఉపేంద్ర, హీరోయిన్లు సమంత, అదా శర్మ, ఆలీ, ప్రభాస్ శ్రీను, రామజోగయ్యశాస్త్రి, సినిమాటో గ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటర్ ప్రవీణ్ పూడి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి’గారి గురించి ఓ సభలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట్లాడటం విని ఆయనకు అభిమానిని అయిపోయాను. ఇప్పటికీ ఆ వీడియోని యూట్యూబ్ లో చూస్తుంటాను. ఈ ఆడియో వేడుకకు హీరో దేవిశ్రీ ప్రసాద్. మంచి పాట లిచ్చాడు. బన్నీ, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ఆల్బమ్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా ఆడియో కూడా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఎంతో ప్రేమతో ఈ ఆడియోకి వచ్చిన మెగా అభిమానులందరికీ కృతజ్ఞతలు. నా ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్ నన్ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఆల్బమ్ కూడా అద్భుతంగా చేసాడు. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అక్కర్లేదు. త్రివిక్రమ్ గారికి ఇది సరిగ్గా సరిపోతుంది. నిర్మాత గారికి, కెమెరా మ్యాన్, ఎడిటర్, ఫైట్ మాస్టర్, సమంత, ఆదాశర్మ, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, నిత్యామీనన్ ఇంకా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. ఇంకా ఆడియో వేడుకలో దర్శకరత్నం దాసరి నారాయణ రావు మాట్లాడుతూ - గీతా ఆర్ట్స్ తన చేతుల మీదుగా ప్రారంభమైందనీ, ఈ బేనర్ లో రెండు హిట్ సినిమాలు వచ్చాయన్నారు. ఒకప్పుడు ఎన్నార్, ఎన్టీఆర్ లకు ఒక సపరేట్ స్టయిల్ ఉందనీ, ఆ స్టయిల్ ఆ తరువాత పవన్ కళ్యాణ్ దే అన్నారు. ఇక ఆ తరువాత స్టైల్ అర్జున్ దే అన్నారు. యువ హీరోలంతా అర్జున్ ను ఫాలో అవుతున్నారన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నికల్ టీమ్, నటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఉపేంద్ర గారికి నా ధన్యవాదాలన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనీ, ఇంతకంటే ఎక్కువ సినిమా గురించి చెప్పలేనన్నారు.