ఎంత జాగ్రత్తలు తీసుకున్ని, ఎన్ని జిమ్మిక్కులు చేసి పైరసీ భూతం నుంచి ఏ సినిమా తప్పుకోలేక పోతోంది. అత్తారింటికి దారేది బాహుబలి .. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వీడియోలు నెట్ లో దర్శనమిచ్చి ఆ సినిమాల నిర్మాతలను భయానికి గురి చేశాయి. బాహుబలి సినిమా పైరసీ చేసిన వాళ్ళు పట్టుబడితే జైలు... కఠిన శిక్ష అంటూ ముందుగా ఎన్ని ప్రకటనలు చేసినా... ఓ టెక్కీ బాహుబలి వీడియోని నెట్ లోకి రిలీజ్ చేసేశాడు. దీంతో సినిమా వాళ్ళకు ఇంత కష్టపడి తీసిన సినిమాలను విడుదల చేసే సమయంలో పైరసీ భూతం నిద్ర పట్టకుండా చేస్తోంది. అందుకే ఇటీవలి కాలంలో సినిమా రిలీజ్ టైమ్ లో పైరసీ పై నిర్మాతలు యుద్ధం ప్రకటిస్తున్నారు. ఆన్ లైన్ లో పైరేట్ లను వేటాడుతూనే పైరసీ డీవీడీ లు విక్రయిస్తున్న వారిని నిర్ధయగా జైళ్లలో వేస్తున్నారు. ఇప్పుడు తమిళ హీరో విజయ్ వంతు వచ్చింది. అతడు నటించిన భారీ బడ్జెట్ చిత్రం పులి త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా పైరసీ గురించి మాట్లాడుతూ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'పైరసీ ని ఆన్ లైన్ లో వ్యాపింపజేసి మా పొట్ట కొట్టొద్దు. సుఖ ప్రసవానికి ముందే గర్భం కోసేయడం కిందే లెక్క' అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పులి సినిమాలో బాహుబలిని మించిన విజువల్ ఎఫెక్ట్స్ ను చూపిస్తామని ఊదరగొట్టేస్తున్నారు ఈ సినిమా బృందం.