ఈ నటుడ్ని బాగా చూసినట్టు అనిపిస్తోంది కదూ.... తమిళ నటుడే అయినప్పటికీ తెలుగులోనూ అడపాదడపా నటించాడు. సిద్ధార్థ, అన్షిక నటించిన సంథింగ్ సంథింగ్ సినిమాలో కాస్త నెగిటివ్ షేడ్ పాత్రలోనూ, ఆ తరువాత నాగార్జున సినిమా డమరుకంలో విలన్ గా నటించాడు. ఈ నటుడి పేరు గణేశ్ వెంకట్రామన్. అభియుమ్ నానుమ్ చిత్రం ద్వారా తమిళ సినిమాకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత కమల్ హాసన్ చిత్రం ఉన్నై పోల్ ఒరువన్ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇటీవల విడుదలైన అచ్చారం చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతం పొల్లాదవన్ చిత్ర హిందీ రీమేక్ లో విలన్ గా నటిస్తున్నాడు. చాలా అందగాడైనప్పటికీ ఈయనకు విలన్ క్యారెక్టర్లే ఎక్కువగా వస్తుండడం విశేషం. అయితే ఈ నటుడికి బుల్లితెర నటి నిషాక్రిష్ణకు మధ్య చాన్నాళ్ళుగా ప్రేమాయణం నడుస్తోంది. వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదట. అయినా సరే పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైన ఈ జంట నిశ్చితార్థం నిరాడంబరంగా జరుపుకుంది. ఇక లాభం లేదనుకున్నారేమో... ఇప్పుడు ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఈ ప్రేమ జంట పెళ్ళిని అక్టోబర్ 22న వైభవంగా జరపడానికి నిశ్చయించారట. ఈ విషయాలను స్వయంగా గణేష్ వెంక్రటామన్ వెల్లడించాడు.