తమిళనాట ఇటీవలే విడుదలైన ఓ హారర్ చిత్రం బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అంతే కాదు కోలీవుడ్ లో మునుపెన్నడు ఏ హారర్ చిత్రం సాధించని కలెక్షన్లు రాబట్టి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకుంటోంది. ఆ చిత్రమే 'డిమాంటె కాలనీ'. కేవలం విడుదలైన ఆరు రోజుల్లో 5.5 కోట్లు సాధించి హారర్ చిత్రాల రికార్డులను తిరగ రాస్తోంది ఈ చిత్రం. దాంతో ఇప్పుడు తెలుగులోకి కూడా అనువాదం కాబోతోంది 'డిమాంటె కాలనీ'. ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ వెర్షన్ హక్కులను ప్రముఖ 'కల్పన చిత్ర' సంస్థ సొంతం చేసుకుంది. ఇంతకుముందు హారర్ మూవీ 'పిశాచి'.. సిద్ధార్థ్ నటించిన 'నాలో ఒకడు' వంటి ఓ డిఫరెంట్ జోనర్ సినిమాలను అందించిన.. 'కల్పన చిత్ర' సంస్థ ఈ 'డిమాంటె కాలనీ' చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేస్తోంది. ఇప్పటికే డబ్బింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్నిజూన్ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక 'డిమాంటె కాలనీ' నటీనటులు.. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి 'కరుణా నిధి' మనవడు 'అరుల్ నిధి' ముఖ్య పాత్ర పోషించిన 'డిమాంటె కాలనీ' చిత్రాన్ని.. పలువురు ప్రముఖుల దగ్గర పని చేసిన టాప్ టెక్నిషీయన్స్ కలిసి రూపొందించారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కో డైరెక్టర్ 'అజయ్' దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి.. ఏ.ఆర్.రెహామాన్ అసిస్టెంట్ 'కెబా' సంగీతం అందించగా.. సంతోష్ శివన్ అసిస్టెంట్ 'అరవింద్ సింగ్' సినిమాటోగ్రఫీ.. శ్రీకర ప్రాసద్ అసిస్టెంట్ ' భువన్' ఎడిటర్ గా పని చేశారు. అయితే ఇంత మంది ప్రముఖుల దగ్గర పని చేసిన టాప్ టెక్నిషీయన్స్ కలిసి ఈ సినిమాకు పని చేయడం విశేషం. హారర్ ప్రధానంగా తెరకెక్కిన 'డిమాంటె కాలనీ' సరికొత్త పంథాలో తెరకెక్కడంతో కోలీవుడ్ లో దుమ్ము రేపుతు విశేష ప్రేక్షకాధరణ పొందుతోంది. అలాగే తెలుగులోను ఈ సినిమా మంచి ఘనవిజయాన్ని త్వరలో అందుకోబోతోంది.