తాప్సీ తెలుగు సినిమాల్లో బాగానే కనిపించినప్పటికీ ఒక్కటి కూడా బాగుందనిపించే క్యారెక్టర్ ఆమెకు రాలేదు. అయినా ఓపికగానే సినిమా చాన్సుల కోసం ఎదురు చూసింది. కాక పోతే ఈ అమ్మడికి పైకి ఒకటి లోపలికొకటి మాట్లాడి బుట్టలో వేసే జాణతనం లేదు పాపం... మరి ఈ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే అలాంటి మాటలు కూడా కొన్ని నేర్చుకోవాలేమో....ఆమె ఇటీవలే ఓ సందర్భంలో మాట్లాడుతూ బాలీవుడ్ లో హీరోయిన్ల కష్టాల గురించి చెప్పుకొచ్చింది. 'మన దగ్గర హీరోకున్నంత ప్రాధాన్యం హీరోయిన్లకు ఉండదు. క్యారెక్టర్ వేరియేషన్స్ లోనూ అంతే! హీరోలు కనీసం అప్పుడప్పుడైనా విభిన్న పాత్రలు చేసే వీలుంటుంది. హీరోయిన్లకి ఆ ఛాన్సు కూడా ఉండదు. హీరోయిన్ల విషయంలో ఇక్కడ మూవీ మేకర్స్ మారాల్సి ఉందంటోంది. ఇలా జరగడానికి చాలా కాలం పడుతుందంటోంది. హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించాలంటే కావాల్సినవి రెండే రెండు. ఒకటి మంచి సినిమాల ఎంపిక. రెండు కష్టపడి పనిచేయడం. అలా ఎంపిక చేసుకుని కష్టపడ్డా సరే... ఈ హెవీ కాంపిటీషన్ లో మనల్ని మనం నిలబెట్టుకోవడం అంత ఆషామాషీ కాదంటోంది. కామెంట్లు చేసేవాళ్లు, పక్కనే ఉంటూ కుంగదీయాలనుకునేవాళ్లు...ఉంటూనే ఉంటారట. అన్నిటినీ సహిస్తూ ముందుకు వెళ్ళడం ఎంత కష్టమో అనుభవిస్తేగానీ తెలియదంటోంది. దక్షిణాది చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడికి 'చష్మే బద్దూర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, 'బేబీ' సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం 'రన్నింగ్ షాదీ డాట్ కామ్' చిత్రంలో నటిస్తోంది. సినీ పరిశ్రమలో ముందుకు వెళ్ళాలంటే... పెద్ద వాళ్ళ అండదండలు కొంత మేరకు ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతామని చెపుతోంది.