సినిమాలు తీయడం ఒక ఎత్తయితే, వాటిని ప్రమోట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుందని సినిమా నిర్మాతలు భావించారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఆలోచనే కేవలం మూడు ఛానళ్ళకు మాత్రమే ప్రకటనలు ఇవ్వాలనుకోవడం. ప్రస్తుతం సినిమాలను ప్రచారం చేసుకోవాలంటే ముఖ్యమైన ప్రచార మాధ్యమం టీవీ ఛానళ్లు, ఇంటర్నెట్, వార్తా పత్రికలు. ఈ మూడింటిలో టీవీ ఛానళ్ల వల్లనే చాలా ఫాస్ట్ గా ఆ సినిమా ప్రజల్లోకి వెళుతోంది. అయితే ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వస్తున్న చానళ్ళ వల్ల ప్రకటనలకు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తోందట. ఒక్కో సినిమాకు కేవలం టీవీ ప్రకటనల ఖర్చు దాదాపు 40 లక్షల వరకు అవుతోందని అంటున్నారు. అందుకే ప్రచార ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కొందరు పెద్ద నిర్మాతలు ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్పీ రేటింగులు ఎక్కువగా ఉన్న టీవీ 9, ఎన్టీవీ, టీ న్యూస్ ఛానళ్ళ కు మాత్రమే యాడ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇస్తే అందరికీ సమానంగా ఇవ్వండి, లేదంటే ఎవరికీ ఇవ్వద్దని కొందరు చానళ్ళ వాళ్ళు వాదిస్తున్నారట. అయితే ఈ సమస్య భారీ సినిమాలకు రావడం లేదు. రూ. 1 నుండి 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు మాత్రం ఈ ప్రకటనల ఖర్చు భరించలేనదిగా ఉంటుందట.. ఈ నిర్ణయం వెనక తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన నలుగురు పెద్ద నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అమలయితే సినిమా వాళ్ళకు ఇబ్బందులు తప్పవనే చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.