ఈ దర్శక లెజెండ్ గుర్తున్నాడా?

January 06, 2015 | 04:04 PM | 56 Views
ప్రింట్ కామెంట్

మోసగాళ్ళకు మోసగాడు ద్వారా తెలుగు చిత్రసీమను హాలీవుడ్ స్థాయికి తీసుకు వెళ్ళిన ఏకైక డైరెక్టర్ కె.ఎస్.ఆర్.దాస్. వంద సినిమాలు పూర్తి చేసుకున్న దర్శకులలో ఈయన ఒకరు. అయితే మిగతా డైరెక్టర్లకు లాగా ఈయనకు అంత పేరు రాలేదు. ఈ పెద్దాయన చివరి రోజుల్లో చాలా కష్టాలు పడ్డాడని, ఆయన చనిపోయాకే తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన సతీమణి నాగమణిదేవి ఈ విషయాలను వెల్లడించారు. ఆమె మాటలు కన్నీరు పెట్టించేలా ఉన్నాయి. ‘‘దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన రోజుల్లో దాస్ గారు ఎంతో మందికి సాయం చేశారు. దర్శకుడిగా గొప్ప స్థాయిలో ఉన్నపుడు మాకు ఆస్తులు బాగానే ఉండేవి. అయితే స్వీయ నిర్మాణంలో సినిమాలు తీసి అన్ని ఆస్తులూ పోగొట్టుకున్నాం. దర్శకుడిగా పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాక ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. మేం చెన్నైలో ఉండగా ఆయన చివరి రోజుల్లో ఓసారి హైదరాబాద్ కు వెళ్ళి మహేష్ బాబును కాల్ షీట్ అడిగారు. కృష్ణ గారితో సూపర్ హిట్లు తీశారన్న అభిమానంతో అతను సరే అన్నాడు. కానీ మద్రాసుకు తిరిగొచ్చి చిరంజీవిగారి అబ్బాయి పెళ్లికి బయల్దేరుతుండగా అనారోగ్యం పాలయ్యారు. డాక్టరు వచ్చి చూసేలోపే కన్నుమూశారు. తర్వాత రెండేళ్లకు... అంటే నాలుగు నెలల క్రితం మా అబ్బాయి కూడా చనిపోయాడు. బాధను భరిస్తూ బెంగుళూరులో కూతురి దగ్గర కాలం వెల్లదీస్తున్నాను. డబ్బు లేకుంటే ఎవరూ గౌరవించరనడానికి దాస్ గారి జీవితమే ఉదాహరణ. చివరి రోజుల్లో ఆయనను ఓ అవార్డు ఫంక్షన్ కు పిలిచారు. ఓ మూల కూర్చోబెట్టారు. అనారోగ్యంతో ఉన్నారని తెలిసినా రాత్రి 11 వరకు ఆయన్ని వేదిక మీదికి పిలవలేదు. అక్కడ ఉండలేక బాధతో వచ్చేశారు. ఆ మధ్య సైమా అవార్డుల ఫంక్షన్ జరిగినప్పుడు పాత తరం డైరెక్టర్లందరి ఫొటోలు పెట్టారు. కానీ అక్కడ వంద సినిమాలకు డైరెక్షన్ చేసిన దాస్ గారి ఫొటో లేదు. చాలా బాధేసింది‘‘ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నాగమణి దేవి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ