సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ కవులు, నాలాంటి కళాకారులు తిరుగుతారని జల్సాలో సినిమాలో పవర్ స్టార్ చేత చెప్పించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. కానీ ఇక్కడ సినిమాల కోసం హీరోల చుట్టూ తిరిగే పరిస్థితిపోయి ఇప్పుడు హీరోయిన్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దర్శకులకు దాపురించింది. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లంటే హీరోల ఛాయిస్. తమకు నచ్చిన హీరోయిన్లను, తమ పక్కన ఏ ఇబ్బంది లేకుండా ‘కంఫర్ట్’ గా ఫీలయ్యే వాళ్లని వెంటపడి మరీ తమ చిత్రాల్లో పెట్టేసుకునేవారు. కానీ, ఇప్పడు పరిస్థితి మారింది. అవసరమనుకుంటే కథ, స్ర్కీన్ ప్లే తదితర అంశాల ఎంపికలో హీరోలకే ఛాన్స్ ఇచ్చినప్పటికీ, హీరోయిన్ల ఎంపిక మాత్రం తమదే అంటున్నారు నేటి తరం డైరక్టర్లు. ఈ జాబితాలో చిన్న దర్శకులే కాదు స్టార్ల్ హోదా లో ఉన్నవారు కూడా తమ ఫేవరెట్ హీరోయిన్లను రిపీట్ చేస్తూ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. హీరోలు అభ్యంతరం పెట్టినప్పటికీ జాన్తా నై అంటూ రిపీట్ మంత్రాన్నే వల్లేస్తున్నారు.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలలో సమంతా, ప్రస్తుతం ఆయన దర్శకత్వంలోనే 'అ .. ఆ' మూవీలోనూ చేస్తోంది. ఇక ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులోను సమంతనే ఎంచుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ తో సినిమా తర్వాత తమిళ హీరో సూర్యతో తివ్రికమ్ ఓ ప్రాజెక్టు చేయనున్నారు. దీంట్లో సమంతనే నాయికగా తీసుకోవాలని త్రివిక్రమ్ ఇప్పటికే ఫిక్స్ అయ్యాడట కూడా. అదే నిజమైతే త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంతాకి ఇది నాల్గవ చిత్రం అవుతుంది.
ఇక తమన్నాతో ‘రచ్చ’ చేయించిన సంపత్ నంది ఇప్పుడు బెంగాల్ టైగర్ కూడా ఆమెనే కంటిన్యూ చేయించాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ లో రేజీనాకు అవకాశం ఇచ్చిన దర్హకుడు రవికుమార్ చౌదరి తన తాజా సినిమా సౌఖ్యం లో కూడా గోపిచంద్ సరసన రేజీనాకు అవకాశం ఇచ్చాడు. సమంతతో ఆల్రెడీ మనం సినిమా చేసిన విక్రమ్ కుమార్ తాజాగా సూర్య పక్కన 24లో కూడా చోటిచ్చేశాడు. ఇక సీతమ్మ వాకిట్లో... సినిమాలో మహేష్ కు జోడిగా సమంతను తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల, బ్రహ్మోత్సవంలో కూడా ఆమెకే ఓటేశాడు.
నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రెండ్ పాతదే. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి లాంటి సీనియర్ దర్శకులు శ్రీదేవీ, జయసుధ, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లను తమ వరుస చిత్రాల్లో ఆయా నటీమణులను రిపీట్ చేసి బంఫర్ హిట్ లు కొట్టారు. బహుశా వారిని ఆదర్శంగా తీసుకునే మన దర్శకులు కూడా ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారేమో.