హీరోయిన్లు ఏ భాషా చిత్రంలోని వారైనా ఇక్కడినుంచి అక్కడికి అక్కడినుంచి ఇక్కడికి అంటూ తిరిగేస్తున్నారు గానీ, హీరోలు మాత్రం ముఖ్యంగా మన తెలుగు హీరోలు ఇతర భాషా చిత్రాల్లోకి చొచ్చుకుపోవడం లేదు. కానీ తమిళ, మళయాళం హీరోలు తెలుగులో తమ సినిమాలు డబ్ చేసుకోవడం, కొందరు డైరెక్టు సినిమాల్లోనూ నటించడం వంటివి చేస్తున్నారు. అక్కడి నటులు కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య, అర్జున్, ఇక మళయాళ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వాళ్ళకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆ హీరోలు తెలుగు డైరెక్టు సినిమాల్లో కూడా నటించారు. ఇక కమల్ హాసన్ అయితే యూనివర్సల్ హీరో అన్న పేరే తెచ్చుకున్నాడు. కానీ మన తెలుగు హీరోలు ఇతర భాషా చిత్రాల్లో నటించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? కనీసం డబ్బింగ్ చేయడం వంటివి కూడా తక్కువే. ఇప్పుడిప్పుడే రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళకు మళయాళ, తమిళ, కన్నడ రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చకుంటున్నారు వారి డబ్బింగ్ సినిమాలు అక్కడ బాగానే ఆడుతున్నాయట కూడా. ఇప్పుడు నెమ్మదిగా మహేష్ బాబు కూడా రెండు భాషల్లో చిత్రం చేయాలని అనుకుంటున్నాడు. పొరుగు రాష్ట్రాల మార్కెట్ పై మన హీరోల కళ్లు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బాహుబలే అని చెప్పాలి.
సరిగా మార్కెట్ చేస్తే.. సినిమాలో కంటెంట్ ఉంటే మన సినిమా ఎక్కడైనా ఆడుతుందని బాహుబలి రుజువు చేసింది. ముఖ్యంగా తమిళ నాట ఈ సినిమా విపరీతంగా కలెక్షన్ రాబట్టింది. బాహుబలి తెచ్చిన ఊపుతో ‘శ్రీమంతుడు’ తమిళ వెర్షన్ ని కూడా ఒకేసారి విడుదల చేస్తున్నారు. మహేష్ తన తర్వాతి సినిమా ‘బ్రహ్మోత్సవం’ తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కేలా చూసుకుంటున్నాడు. ఇకపై మహేష్ తన ప్రతి సినిమానూ తమిళంలో రిలీజ్ చేయాలని.. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవాలని చూస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ప్రతి సినిమా కూడా తమిళంలో విడుదలవుతుందనడంలోనూ సందేహం లేదు. మరోవైపు ప్రభాస్ కూడా తమిళ మార్కెట్ పై కన్నేస్తాడనడంలో సందేహం లేదు. మిగతా హీరోలు కూడా ఈ ట్రెండును అందిపుచ్చుకోవడం ఖాయమే.
ఐతే మన హీరోల మార్కెట్ తమిళంలో పెరుగుతున్న సమయంలోనే తమిళ హీరోల మార్కెట్ మనదగ్గర పడిపోతుండటం గమనార్హం. తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్.. ‘లింగ’తో తన మార్కెట్ ను బాగా దెబ్బ తీసుకున్నాడు. ఆ ప్రభావం రజినీ తర్వాతి సినిమాపై కచ్చితంగా ఉంటుంది. కమల్ హాసన్ మార్కెట్ ఎంత దెబ్బ తిందో ‘ఉత్తమ విలన్’ రుజువు చేసింది. మరోవైపు గత కొన్నేళ్లలో తెలుగులో ఫాలోయింగ్ బాగా పెంచుకుని ఓ దశలో రూ.15 కోట్ల మార్కును అందుకున్న సూర్య ఇప్పుడు పది కోట్ల లోపుకు పడిపోయాడు. కార్తి అసలీ మధ్య తెలుగులో సినిమానే విడుదల చేయట్లేదు. విశాల్ అజిత్ ల సంగతీ అంతంతమాత్రంగానే ఉంది. మొత్తానికి తమిళంలో మనోళ్ల మార్కెట్ పెరగడం ఇక్కడ వాళ్ల మార్కెట్ పడటం ఒకేసారి జరుగుతుండటం విశేషమే.