వెండితెరపై తమ అద్భుతమైన ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న నటీనటులు ఎంతోమంది. కొందరు నటనపరంగానే ఆకట్టుకుంటుంటే, మరికొంత మంది నటనతోపాటు డాన్సుల్లో కూడా రాణిస్తూనే ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్ లలో టాప్, చిన్న హీరోలు తేడా లేకుండా చాలా మందితో కూడిన లిస్ట్ ఉంది. మరీ ఆ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం...
అల్లు అర్జున్: తన ఎనర్జిటిక్ యాక్షన్, లుక్ తో స్టైలిష్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. రెండో చిత్రం ఆర్యతో తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ స్టెప్పుల మజా ఏంటో రుచిచూపించాడు. క్లాస్ ఆడియన్స్ తోపాటు మాస్ స్టెప్పులతోపాటు ఆ వర్గ ఆడియన్స్ హృదయాలను కూడా కొల్లగొట్టేశాడు. ముఖ్యంగా మైకేల్ జాక్సన్ మూన్ వాక్ స్టెప్పులకు మనోడు పెట్టింది పేరు. ఒక్క టాలీవుడే కాదు మాలీవుడ్, బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ గురించి, అతని డాన్స్ గురించి తెగ చర్చించుకుంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజులోనే అల్లు అర్జున్ అంటేనే డాన్స్...స్టెప్స్ అన్న రేంజ్ కి ఎదిగిపోయాడు.
జూనియర్ ఎన్టీఆర్: నందమూరి నటవారసుడిగా వెండితెరకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ నాలుగైదు చిత్రాలతోనే టాప్ హీరో స్థాయికి ఎదిగిపోయాడు. నటనలో విశ్వరూపం చూపేందుకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకోవటంలో దిట్ట. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి రావటంతో యాక్టింగ్ లోని స్కిల్స్ ని అవలీలగా అవపోసన పట్టేశాడు. ఎన్టీఆర్ చిన్నతనంలో కూచిపూడి డాన్సర్. అదే సినిమాల్లో స్కోప్ ఉన్న స్టెప్పులు వేసేందుకు అవకాశం కల్పించింది. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నా సరే తన స్టెప్పులతో విజిల్స్ వేయించగల సత్తా జూనియర్ ది. ముఖ్యంగా మాస్ స్టెప్పులకు ఎన్టీఆర్ పెట్టింది పేరు.
రామ్ చరణ్: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. తొలిచిత్రం చిరుత తోనే మెగాపవర్ స్టార్ ట్యాగ్ లైన్ తో రాణిస్తూ వస్తున్నాడు. ఇండస్ట్రీకి అసలు డాన్స్ ఓనమాలు చెప్పింది మెగాస్టార్ అయితే, అదే పంథాను ట్రెండ్ కి తగ్గట్టు కొనసాగిస్తూ వస్తున్నాడు రాంచరణ్. సినిమా సినిమాకి డాన్స్ డోస్ ని పెంచుకుంటూ వస్తున్నాడే తప్పా... ఎక్కడా తగ్గలేదు. ఒకరకంగా మెగా కాంపౌండ్ లో డాన్స్ వార్ లో టాప్ పొజిషన్ లో ఉంది చెర్రీయే. తన చిత్రాల సక్సెల్లో స్టెప్పులకి కూడా ఓ ప్రాముఖ్యతని కల్పించి, ప్రేక్షకుడు చర్చించుకునే స్థాయికి తీసుకెళ్లాడు.
నితిన్ : దర్శకుడు తేజ స్కూల్ నుంచి వచ్చిన స్టార్. జయంలో అమాయకపు యువకుడి పాత్రలో నటించినా... కాలేజీ స్టూడెంట్ గా సైలో సత్తా చాటినా... డాన్స్ విషయంలో మాత్రం నితిన్ గట్టోడే. సూటిగా చెప్పాలంటే రికార్డు స్థాయి వరుసగా 13 ఫ్లాపులు వచ్చినప్పటికీ ఆయా చిత్రాల్లోని స్టెప్పులు మాత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్టింగ్ లో కాస్త వీక్ గా కనిపించినప్పటికీ డాన్స్ ల్లో మాత్రం నితిన్, స్టార్ హీరోలతో పోటీపడాతాడన్నది మాత్రం ఒప్పుకుని తీరాల్సిన విషయం. ఒకానోక సమయంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ డాన్స్ స్టార్ హృతిక్ రోషన్ చేత శభాష్ అనిపించుకున్నాడంటే నితిన్ మాములోడు కాదనే విషయం క్లియర్ గా తెలిసిపోతుంది.
రామ్: ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ లైన్ తో ప్రస్తుతం టాలీవుడ్ లో హవా సాగిస్తున్న కుర్రహీరో. చిన్నవయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చి యూత్ కి తగ్గట్టు స్టైల్ స్టెప్పులతో అలరిస్తూ వస్తున్నాడు. దేవదాస్ దగ్గర నుంచి పండగచేస్కో వరకు రామ్ స్టెప్పులకు అంతకంతకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ యూత్ లో రామ్ కి ఫాలోయింగ్ ఉండటానికి కారణం డాన్సే.
ఇక బాలీవుడ్ విషయానికొస్తే ఈ లిస్ట్ కూడా పెద్దదే. హృతిక్ రోషన్ చిన్నప్పటి నుంచే ట్రెయిన్డ్ డాన్సర్ గా కాగా, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్ లు డాన్స్ పై మక్కువ పెంచుకున్నారు. కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్, శింబులు, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ లు వయసు 40లో అడుగుపెడుతున్నా డాన్స్ ల్లో మాత్రం ఇరగదీస్తూ ఫ్యాన్స్ ల చేత కేకలు వేయిస్తున్నారు.