బాలీవుడ్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల హంగామా మొదలైంది. ఎప్పటిలాగానే ఈ ఏడు కూడా నాయికా నాయకుల పోటీ గురించి చర్చాలు నడుస్తున్నాయి. ప్రతీ ఏడాది బాలీవుడ్ లో ఈ అవార్డు కోసం ఇద్దరు నాయికలు పోటీ పడేవారు. అయితే ఈసారి మాత్రం పోటీ మరింత రసవత్తరంగా సాగుతోంది. హీరోయిన్ సెంట్రిక్ గా రూపొందిన రెండు సినిమాలు బాలీవుడ్ ఆడియన్స్ ను ఊపేయడమే కాకుండా ఇప్పుడు అవార్డులు ఇచ్చే వారికి కూడా అయోమయంలో పడేసింది. ఫిలింఫేర్ అవార్డులు తాజాగా నామినేషన్లను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరి చాలా ఆసక్తిగా ఉంది. గత ఏడాది వచ్చిన సినిమాలన్నంటిలోకి నాయకిల ప్రదర్శన చూస్తే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఇద్దరు. ఒకరు కంగనా రనౌత్, మరొకరు ప్రియాంక చోప్రా. మేరీ కోమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘మేరీ కోమ్’. ఈ సినిమా కోసం ప్రియాంక ఎంతో కష్టపడిందట. ఈ సినిమాలో కూడా చాలా మెచ్యూర్డ్ గా నటించింది. అభిమానుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కంగనారనౌత్ ‘క్వీన్’ సినిమాతో రచ్చ చేసింది. ఓ అమాయక ఢిల్లీ ఆడపిల్లగా ప్యారిస్ వీధుల్లో ఈమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆద్యంతం సినిమాను తన భుజాలపై నడిపిస్తూ అబ్బురపరచింది. ఈ ద్దరిలో మరి అవార్డు ఎవరిని వరిస్తుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అంతేనా... ఈ ఇరువురే నేషనల్ అవార్డులకు కూడా నామినేట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఈ యుద్ధం చాలా ఆంక్సైటీగా నడుస్తుంది.