ఈ టాప్ డైరెక్టర్ పిచ్చి పనులూ చేస్తాడా? ఎందుకు చేయరూ అప్పుడప్పుడు ఎవరైనా చేస్తుంటారు పిచ్చి పనులు. మరి తండ్రి కొట్టేంతటి పిచ్చి పని చేశాడట. కొట్టేంత పిచ్చి పని అంటే ఖచ్చితంగా అది తప్పు పనే... ఈ విషయాలు చెప్పుకొచ్చాడు రాజమౌళి తండ్రి ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు తండ్రి కొడుకులిద్దరూ టాప్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయారు. భజిరంగి భాయిజాన్, బాహుబలి కథలను అందించినందుకు తండ్రినీ, బాహుబలి సినిమా ప్రపంచ దృష్టికి తీసుకువెళ్ళిన కొడుకునూ అందరూ పొగిడేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన కథలన్నీ తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్నప్పుడే మైండ్ లో సిద్ధమై పోతాయట. ఇప్పటి వరకూ ఆయన దాదాపు సినిమాలకు కథలు రాశానని చెప్పారు. బాహుబలి గురించి...మాట్లాడుతూ ఒక శుభముహూర్తాన, ఇంట్లో ఉన్నప్పుడు ‘ప్రభాస్‌తో ఒక సినిమా చెయ్యాలి నాన్నా' అన్నాడు రాజమౌళి. ‘కాస్ట్యూమ్స్ కరెక్ట్‌గా ఉండాలి, ప్రతీ కేరక్టరూ పరిపుష్టంగా ఉండాలి' అన్నాడు. అప్పుడే ఆ సినిమా కథ పురుడుపోసుకుందన్నారు. బాహుబలి చిత్రంలోని ఆఖరి సన్నివేశాన్ని, నేను కథాప్రారంభంగా రాజమౌళికి చెప్పినప్పుడు అది ఆయనకు బాగా నచ్చింది. బాహుబలి సినిమాకు సంబంధించిన పాత్రలు, సన్నివేశాలు రాజమౌళి మనసులోంచి పుట్టినవే. ఆయన మనసులోని ఆలోచనలను వరుస క్రమంలో పేర్చడానికి నేరు రచయితగా దోహదపడ్డాను అని విజయేంద్ర ప్రసాద్ నవ్య ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక రాజమౌళి చిన్న నాటి విషయాలను ప్రస్థావిస్తూ రాజమౌళి అమ్మకూచిగానే పెరిగాడనీ కానీ ఒకసారి చిన్నతనంలో రాజమౌళి చేసిన పిచ్చి పనికి కొట్టవల్సి వచ్చిందన్నాడు. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి నేలమీద ఒక లైనులో పాకుతూ వెళుతున్న చీమల్ని నలుపుతూ చంపడం గమనించాను. వెంటనే పిర్ర మీద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాను. ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు రాజమౌళి. ఎత్తుకుని సముదాయించాను. ఇప్పుడు ‘నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? అని అడిగాను. కన్నీళ్ళు పెట్టుకుంటూనే తెలియదన్నాడు. ‘ఎందుకు ఏడ్చావ్?' అని అడిగాను. నొప్పి పుట్టింది అన్నాడు. నువ్వు నలిపినప్పుడు చీమలకు కూడా అలాగే నొప్పి పుడుతుంది. జీవహింస మహాపాపం. ఇతరుల్ని ఎప్పుడూ అలా బాధ పెట్టకూడదు' అదండీ రాజమౌళి చిన్న తనంలో చేసిన పెద్ద తప్పు.