ఒకప్పటికీ ఇప్పటికీ సినిమాల్లో... సినిమా నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో నిర్మాతకు, వారు పెట్టిన ప్రతి పైసాకు చాలా విలువుంది. హీరోలు, డైరెక్టర్లు కూడా వారి మాటకు చాలా గౌరవం ఇచ్చారు. కానీ ఇప్పుడలా కాదు ఏ హీరోకు ఏ డైరెక్టర్ కావాలో... వారు నిర్ణయించుకున్న తరువాతే... నిర్మాతలకు ఛాన్స్. ఏరియాలు, పర్సెంటేజీలు... గట్రా... అప్పుట్లో కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ, ఇప్పుడు తీసే భారీ బడ్జెట్ సినిమాలకు నిర్మాతలకు అంత స్వేచ్ఛ ఉండడం లేదు. ఇక థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే జనాల సంఖ్య కూడా తగ్గిపోవడం వల్ల... ఒక మెయిన్ లొకాలిటీలో థియేటర్ నడపడం కంటే షాపింగ్ కాంప్లెక్సుల వల్ల ఎక్కువ లాభాలు గడించవచ్చనే ఆలోచనతో ఎంతో మంది థియేటర్ యజమానులకు రావడంతో థియేటర్లను పడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పరిస్థితుల్లో మార్పులు... జనాల మైండ్ సెట్ లో మార్పు కారణంగా ఒకప్పటిలా సినిమాలు నిర్మించే సాహసం ఇప్పుడు చేయలేకపోతున్నారు. ముఖ్యంగా సీనియర్ నిర్మాతలైతే చివరి సినిమాలు దెబ్బకొట్టిన వారు ఇక లాభం లేదనుకుని మిన్న కుండిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఒక వేళ వారు సినిమాలు చేద్దామని ముందుకు వచ్చినా ఇప్పుడున్న వాతావరణానికి వారు వెనుకడుగు వేస్తున్నారు. ఈ దశలో ఎన్నో బ్లాక్ బస్టర్లు నిర్మించిన భారీ ప్రొడక్షన్ బేనర్ లు కనుమరుగవుతుండడం మనం గమనించవచ్చు. వారిపై నిహార్ ఆన్ లైన్ ప్రత్యేక కథనం...
అశ్వినీదత్: నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. టాలీవుడ్ లో ఈ బేనర్ కు మంచి పేరు. 1975లో ఎన్టీఆర్ తో ‘ఎదురులేని మనిషి’తో సినిమాల నిర్మాణం మొదలైంది. యుగపురుషుడు, అడవి సింహాలు, ఆఖరి పోరాటం, జగదేక వీరుడు అతి లోక సుందరి, స్టూడెంట్ నెంబర్ వన్, ఇంద్ర వంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ నిర్మించారు. 2011లో శక్తి సినిమా చివరిది. అది కూడా అట్టర్ ఫ్లాప్ సినిమా. నాలుగేళ్ళ గ్యాప్ వచ్చినా మరే సినిమా ఈ బేనర్ లో రాలేదు. ఇంద్ర తరువాత చిరుత మధ్యలో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి.
ఏడిద నాగేశ్వర్ రావు: ఇటీవల కాలం చేశారు ఈ నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పై దర్శకుడు కె.విశ్వనాథ్ తో అనేక సినిమాలు నిర్మించారు అన్నీ సంగీత, నృత్యపరమైన సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఈ బేనర్ లో ఎన్నో అవార్డు మూవీలు వచ్చాయి. 1978లో సిరిసిరి మువ్వతో మొదలై శంకరాభరణం, సీతాకోక చిలుక, సితార, సాగర సంగమం, సిరివెన్నెల, స్వాతిముత్యం... చివరిగా ఆపద్భాంధవుడు (1992)తో పూర్ణోదయ వారి సినిమాలు ముగిసాయి. అన్నీ క్లాస్ ఆడియన్స్ మెచ్చిన సినిమాలు ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఈయన వారసులు చిత్ర రంగానికి సంబంధించిన వారే (ఏడిద శ్రీరామ్) అయినప్పటికీ ఎందుకో నిర్మాతలుగా పగ్గాలు చేపట్టలేకపోతున్నారు.
మల్లె మాల శ్యాంప్రసాద్ రెడ్డి: ఎం.ఎస్.రెడ్డి తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని తీసుకుని ఆయన ప్రొడక్షన్ బేనర్ అయిన మల్లె మాల ప్రొడక్షన్ లో ఎన్నో సినిమాలు నిర్మించారు. టాలీవుడ్ లో ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థగా చెప్పుకోవచ్చు. ఆయన మొదటి చిత్రం 1987లో తలంబ్రాలుతో మొదలు పెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ఈయన చిత్రాల్లో సాంకేతిక నైపుణ్యం బాగా కనిపిస్తుంది. డబ్బుల కోసం పాకులాడకుండా యువతకు ఎంతో సందేశాన్నందించే సినిమాలు ఈయన నిర్మాణకత్వంలో వచ్చాయి. ఆహుతి, అంకుశం, అమ్మోరు, అరుంధతి ఎక్కువగా స్త్రీ ప్రాధాన్యం గల సినిమాలు నిర్మించారు. ఈయన రచయిత కూడా. మరి ఎందువల్లో అరుంధతి తరువాత మళ్ళీ సినిమా చేయలేదు. ఇప్పుడు టీవీ షోలు ఢీ, జీన్స్, అదుర్స్ (ముగిసినవి) క్యాష్, స్టార్ మహిళ, జబర్దస్త్ ప్రోగ్రాముల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
నాగబాబు : నటుడు నిర్మాత అయిన నాగబాబు అంజనా ప్రొడక్షన్ బేనర్ పై ఎన్నో సినిమాలు నిర్మించారు. తన చివరి సినిమా అయిన ఆరెంజ్ బాగా దెబ్బకొట్టడంతో ఆయన సినిమాల నిర్మాణానికి పూర్తిగా దూరమైనట్టు కనిపిస్తోంది. అంతకు ముందు అంజనా ప్రొడక్షన్ బేనర్ లో రుద్రవీణ సినిమా 1988లో మొదలు పెట్టారు ఇది ఆర్థికంగా లాభ పడిన సినిమా కాకపోయినా చిరంజీవికి మంచి పేరు తెచ్చిన సినిమా ఈయన సినిమాలన్నీ అన్నయ్య హీరో చిరంజీవితోనే ఎక్కువగా చేశారు. బావగారు బాగున్నారా? బ్లాక్ బస్టర్ సినిమా మిగిలిన సినిమాలన్నీ ఆవరేజ్ గా ఆడాయి. అయితే చిరంజీవి తన సినిమాలు ఎక్కువగా బావమరిది అల్లు అరవింద్, తమ్ముడు నాగబాబు బేనర్ లో చేశారు.
కె.ఎస్.రామారావు: క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించిన నిర్మాత కె.ఎస్.రామారావు. ఈయన మొదట ఓ కన్నడ సినిమాను అనువాదం చేశాడు. అది ఫ్లాపయ్యింది. ఆ తరువాత ఎర్రగులాబీలు (1980), టిక్ టిక్ టిక్, మౌనగీతం సినిమాలు చేసి నిర్మాతగా నిలదొక్కుకున్నారు. చివరి సినిమా దమ్ము (2012). సక్సెస్ అయిన సినిమాలు క్రిమినల్, ఛాలెంజ్, అభిలాష, స్వర్ణ కమలం వంటివి... ఎక్కువ సినిమాలు చిరంజీవితో చేశారు.
కె.రాఘవేంద్రరావు: దర్శకుడు రాఘవేంద్ర రావు ఓన్ బేనర్ లోఆర్.కె. ప్రొడక్షన్స్ లో కొన్ని సినిమాలు చేశారు. హిందీలో కూడా నిర్మాతగా, డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈయన చేసిన సినిమాలు స్టూడెంట్ నెంబర్ వన్ కు కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇద్దరు మిత్రులు, అల్లరి ప్రియుడు, యుద్ధ భూమి, నయాకదమ్ (హిందీ) ఏ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ (హిందీ) అనగనగా ఓ ధీరుడు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ఇప్పుడు ఆర్.కె. బ్యేనర్ ను అల్లుడు శోభు యార్లగడ్డకు అప్పగించారు. కో ప్రొడ్యూసర్ గా రాఘవేంద్ర రావు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆర్కామీడియా బేనర్ పై బాహుబలి చిత్రాన్ని నిర్మించారు.
ఎం.ఎస్.రాజు: సుమంత్ ఆర్ట్స్ బేనర్ పై పలు చిత్రాల చిత్రాలు నిర్మించిన నిర్మాత ఎం.ఎస్ రాజు. ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు చాలానే నిర్మించారు. 2003లో నిర్మించిన ఒక్కడు సినిమా వీరికి బాగా లాభాలు తెచ్చి పెట్టింది. 1990లో శత్రువు (దిల్ రాజు మొదటి డిస్ట్రిబ్యూటర్ గా చేసిన చిత్రం) సినిమాతో నిర్మాతగా కెరీర్ మొదలు పెట్టారు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, దేవి, మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. తనయుడు సుమంత్ అశ్విన్ మొదటి సినిమా తూనిగ తూనిగకు దర్శకత్వం కూడా వహించారు.
దగ్గుబాటి సురేష్: సురేష్ ప్రొడక్షన్ బేనర్ లో దగ్గుబాటి రామానాయుడు ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఆ తరువాత ఆయన తనయుడు ఈ ప్రొడక్షన్ కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కాలంలో వేరే వాళ్ళతో టై అప్ అయి సినిమాలు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు తండ్రి నిర్మించిన సినిమాలు, సాహసం తనయుడు చేయలేకపోతున్నాడనే చెప్పాలి. రామానాయుడు హిందీ, తెలుగు, తమిళ, బెంగాలీ చిత్రాలను కూడా నిర్మించారు. ఈ బేనర్ లో మొదటి సినిమా 1963లో అనురాగం. ఈ ప్రొడక్షన్ 48 సంవత్సరాల కాలంలో 131 సినిమాలు నిర్మించింది. ఒక ప్రొడక్షన్ కంపెనీపై ఇన్ని సినిమాలు రావడం రికార్డుగా నమోదైంది. ఈ బేనర్ విజయా పిక్చర్స్ తో కలిపి విజయ సురేష్ కంబైన్స్ తో 10 చిత్రాలు నిర్మించారు. ప్రేమనగర్, శ్రీకృష్ణ తులాభారం అప్పట్లో సూపర్ హిట్ అయినవి ఈ ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలు దాదు 90 శాతం హిట్ చిత్రాలే. వెంకటేష్ హీరోగా రంగ ప్రవేశం చేసిన తరువాత ఆయన చిత్రాలూ నిర్మిస్తూ వస్తున్నప్పటికీ ఇతర హీరోలతోనూ కొన్ని చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా కొత్త నటీనటులకు రామానాయుడు అవకాశం ఇచ్చారు. సురేష్ ఆధ్వర్యంలో మాత్రం చాలా మూడు నాలుగు సంవత్సరాలకు ఓ సినిమా చేయడం జరుగుతోంది. ఈ బేనర్ లో వచ్చిన చివరి సినిమా దృశ్యం (2014)
కృష్ణంరాజు: కొందరు హీరోలు తమ ఓన్ ప్రొడక్షన్ మొదలు పెట్టిన చేశారు. అందులో కృష్ణం రాజు కూడా ఉన్నారు. పాత హీరోల్లో అయితే కాంతారావు సొంత సినిమాలు నిర్మించి చిల్లి గవ్వ లేకుండా చేసుకున్నారు. ఆ తరువాత కృష్ణ, కృష్ణం రాజుల పేర్లు వినిపిస్తాయి. ఈయన తన ఓన్ ప్రొడక్షన్ లో నిర్మించిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ మూవీలే. 1974లో కృష్ణ వేణి సినిమా సొంతంగా నిర్మించి నటించారు. నిజానికి ఇందులో హీరో నెగెటివ్ రోల్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయినా, కథ నచ్చడంతో ఈ సినిమాను ఓ సాహసంగానే చేశారు. ఆ తరువాత భక్త కన్నప్ప, అమర దీపం, మన ఊరి పాండవులు, మధుర స్వప్నం, త్రిషూలం, బొబ్బిలి బ్రహ్మన్న తాండ్ర పాపారాయుడు చాలా గ్యాప్ తరువాత అంటే ఇక ఈయన సినిమాలు తీయడం ఆపేసినట్టే అనుకునే సమయంలో ‘బిల్లా’ (2009) అనే సినిమా నిర్మించారు.
కృష్ణ: అప్పట్లో ఉన్న హీరోల్లో సాహసవంతుడిగా, దానదర్మాలు చేసే మంచి వ్యక్తిగా కృష్ణకు పేరు. నటించడం తేలికే... సినిమాలు నిర్మించడం అనేది ఒక ఛాలెంజింగ్ రోల్. ఇందులోనూ సక్సెస్ అయ్యాడు కృష్ణ. ఈయన పద్మాలయా స్టూడియోస్ బేనర్ లో చాలా సినిమాలు నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ సినిమాలు కూడా నిర్మించారు. నిర్మాతగా ఈయన మొదటి సినిమా దేవుడు చేసిన మనుషులు ఎన్టీఆర్, కృష్ణ (1973) కలిసి నటించిన ఈ సినిమా పెద్ద సక్సెస్, పాటలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. తరువాత అల్లూరి సీతారామ రాజు కూడా పెద్ద హిట్... ఇలా 1986 వరకూ ఎన్నో సక్సెస్ సినిమాలు చేశారు. 2003 (సర్పంగి) వరకూ పద్మాలయా స్టూడియోస్ లో సినిమాలు నిర్మించారు. ఆ తరువాత ఈ బేనర్ లో సినిమాలు రాలేదు.
అక్కినేని నాగార్జున: అన్నపూర్ణ స్టూడియో బేనర్ చాలా సక్సెస్ ఫుల్ చిత్రాలు నిర్మించారు. దాదాపు 2000 సంవత్సరం నుంచి ఈ బేనర్ లో సినిమాలు రావడం ఆగిపోయాయి. దీంతో నాగార్జున గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్మెంట్ పేరిట పలు చిత్రాలు నిర్మించారు. వాటిలో నిన్నే పెళ్ళాడతా, సీతారాముల కళ్యాణము చూతము రారండి. ఆహా, చంద్రలేఖ వంటి కొన్ని హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ బేనర్ కూడా కనుమరుగైంది.