నారా రోహిత్ కథానాయకుడిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా అసుర. ఈ చిత్రానికి ఆయన సమర్పకుడు. ఈ సినిమా ట్రైలర్లో ఈ మధ్యనే విడుదలైంది. రాక్షసుడా? వాళ్లు ఎప్పుడైనా గెలిచారా? అని ట్రైలర్ లో వినిపించే చివరి డైలాగు అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో రాక్షసుడు అని పేరు తెచ్చుకున్న ధర్మ ఎవరు? అనేది కూడా ఆసక్తికరమే. సినిమా టైటిల్ అసుర కాబట్టి ధర్మ అనే పేరు నారా రోహిత్ దే అని అర్థం చేసుకోవాలి. ‘సమస్య నాది కానప్పుడే నేను మనిషిని కాదు. అదే సమస్య నాదయితే..’ అని ఆవేశపడే పాత్రలో రోహిత్ కనిపిస్తున్నాడు. ‘రేయ్ నా టైమింగ్ మామూలుగా ఉండదు. నీకర్థమయ్యేలోగే అంతా అయిపోద్ది’ అని ఇంటెన్స్ తో అతను చెప్పే డైలాగుకు ఈలలు పడటం తప్పనిసరి. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే డైలాగ్ అది. జనాలతో కొంచెం నోటితో మట్లాడటం నేర్చుకోవయ్యా అని తన పై అధికారి అనే మాటలకు ‘నోటితో చెప్పడం కన్నా చేత్తో చెప్పే మాటే గుర్తుంటుంది సార్’ అని రోహిత్ సమాధానమిచ్చే విధానం చూస్తే విజయవంతమైన రోహిత్ సినిమాల డైలాగులు గుర్తుకొస్తాయి. ‘నేరం పాపం ఒకటేరా, ఒకసారి చేస్తే చచ్చేంత వరకు వెనకే వస్తాయి’ అని నారా రోహిత్ చెప్పే విధానం కూడా బావుంది. ‘ మా వాళ్లంతా యావరేజ్ గా ఉన్నారు కదా. నేను అందంగా ఉన్నాను కదా’, ‘నీకు లాఠీలక్కర్లేదు బాబూ మాటల్తోనే కొట్టేస్తావ్’ అనేవి ట్రైలర్ లో వినిపించే హీరోయిన్ మాటలు. ‘కిస్’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ప్రియా బెనర్జీ ఈ సినిమాలో నాయికగా నటించింది. శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్ నిర్మాతలు. కృష్ణ విజయ్ దర్శకత్వం వహించారు. టైటిల్ డిజైన్, నారా రోహిత్ పోలీస్ గెటప్ బావున్నాయి. విలన్ లను రోహిత్ కొట్టే తీరుచూస్తే ఎ సర్టిఫికెట్ సినిమా అనిపిస్తోంది.