కెరీర్ ఆరంభంలో కొత్తవాళ్లతో ఓవైపు, మరోవైపు టాప్ హీరోలతో చిత్రాలు తీశాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్లుగా, మ్యూజికల్ హిట్లుగా అవి పేరు పడ్డాయి. దాంతో నిర్మాతగా మారి ఉన్నదంతా పెట్టి వరుసగా సినిమాలు చేశాడు. ఫలితం అన్నీ డిజాస్టర్లే. దేవదాస్ తర్వాత హిట్ మొహం చూడలేకపోయాడు దర్శకుడు కమ్ నిర్మాత వైవీఎస్ చౌదరి. బాలయ్యను హీరోగా పెట్టి ఒక్క మగాడు అంటూ తీస్తే డిజాస్టర్. రవితేజ ను హీరోగా పెట్టి గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పును తీస్తే అది కూడా అంతే. ఇక లాభం లేదని మెగా మేనల్లుడు సాయిధరమ్ తో రేయ్ తీసి ఆగి ఆగి రిలీజ్ చేస్తే అది ఎప్పుడొచ్చిందో... ఎప్పుడు పోయిందో తెలీకుండా అయిపోయింది. ఒకానొక దశలో ఆర్థికంగా చితికిపోయాడు. పని అయిపోయింది అని అనుకున్నారంతా. కానీ, అసలు తగ్గే ప్రసక్తే లేదంటున్నాడు చౌదరి.
తనకు అచ్చొచ్చిన కొత్తవాళ్ల సెంటిమెంట్ ను మరోసారి ఫాలో అయిపోదామనుకుంటున్నాడు. త్వరలో పూర్తిగా కొత్తవాళ్లతో మరో చిత్రాన్ని ప్రారంభించేందుకు వైవీఎస్ చౌదరి సిద్ధమైపోతున్నాడు. ఓ కొత్త కుర్రాడిని ముంబైకి చెందిన ఓ బ్యూటీ కాంబినేషన్లో మరో ప్రేమకథను త్వరలో తెరకెక్కిస్తానని అనౌన్స్ చేశాడు. ఇంతకీ ఈ చిత్ర టైటిల్ ఏంటో తెలుసా? నేడే.. ఈనాడే.. కరుణించె నన్ను చెలికాడే... స్వతహాగా సీనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన చౌదరి ఇలా తన టైటిల్ కు ఎన్టీఆర్ పాపులర్ పాట (భలే తమ్ముడు చిత్రంలోని నేడే... ఈనాడే..) పల్లవినే టైటిల్ గా పెట్టుకుంటున్నాడు.