రాయల్స్ పై పగ తీర్చుకున్న సెహ్వాగ్ సేన

April 22, 2015 | 10:30 AM | 44 Views
ప్రింట్ కామెంట్
shaun_marsh_kxip_royals_2015

ఐపీఎల్ -8 లో మంగళవారం రాజస్థాన్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇరుజట్లు సమాన స్కోరు చేయడంతో ఫలితం తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఓవర్ లో చూడచక్కటి షాట్లతో రాణించిన కింగ్స్ లెవెన్ పంజాబ్, రాజస్థాన్ పై విజయం సాధించింది. అంతేగాక తనపై ఇదే సిరీస్ లో నెగ్గిన రాజస్థాన్ పై పంజాబ్ పగ తీర్చుకున్నట్లైంది. అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వనించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన అజింక్యా రహానే (74), షేన్ వాట్సన్ (45) రాణించడంతో జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత కరుణ్ నాయర్ (25) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో 200 పరుగులు దాటుతుందనుకున్న స్కోరు 191 కే పరిమితమైంది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ అనవసరంగా రనౌట్ కావటంతో ఓ దశలో జట్టుకు పరాజయం తప్పేలా లేదన్న భావన కలిగింది. అయితే షాన్ మార్ష్ (65) డేవిడ్ మిల్లర్ (54) లు రాణించడంతో పంజాబ్ 191 పరుగులు చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ