సోషల్ మీడియా పోటీ ప్రపంచంలో మరో ముందడుగు వేసేందుకు ఫేస్ బుక్ ప్రయత్నాలు ప్రారంభించింది. లింక్డ్ ఇన్ లాంటి సైట్లకు పోటీగా ఆఫీస్ వెర్షన్ ప్రారంభించాలని ఫేస్ బుక్ నిర్ణయించింది. సహోద్యోగులతో చాట్ చేయడానికి, ప్రొఫెషనల్ కాంటాక్టులు పెంచుకోడానికి, డాక్యుమెంట్లు పంచుకోడానికి వీలుగా 'ఫేస్ బుక్ ఎట్ వర్క్' అనే సైట్ ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన పని ఇప్పటికే చాలా రహస్యంగా జరుగుతుందని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఇక రెండో త్రైమాసికంలో ఫేస్ బుక్ కు రూ. 4900 కోట్ల లాభం వచ్చింది. ఈ ఫలితాలను ప్రకటించే సందర్భంలోనే ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఈ కొత్త విషయాన్ని సూచన ప్రాయంగా వెలువరించాడు. ఈ కొత్త ఉత్సహాంతో రానున్న రోజులలో పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తామని, కంప్యూటింగ్ ప్లాట్ ఫారాలలో తర్వాతి తరాన్ని రూపొందిస్తామని అన్నారు. సహ విద్యార్థులతో కలవడానికి 2004లో హార్వర్డ్ కాలేజి స్నేహితులతో కలిసి జుకర్ బర్గ్ సరదాగా ఏర్పాటుచేసిన ఈ నెట్ వర్కింగ్ సైటే మనోడి ఫేట్ ను మార్చి పడేసింది.