ప్రపంచదేశాలతో అన్నిరంగాలలో పోటీపడి ముందుండే అమెరికా తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. అయితే అది ఏ సాఫ్ట్ వేర్ రంగంమో, ఆయుధాల తయారీ, మరేయితర రంగంలో కాదు. అమెరికాకు చెందిన ఓ ధనవంతుడు తన భార్యతో విడాకులనంతరం భరణంగా ఇవ్వడానికి ఏకంగా 6,150 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికన్ టాప్ కుబేరులలో ఒకరైన హరొల్డ్ హమ్(68) మొత్తం ఆస్తుల విలువ 86వేల కోట్లు. ఈ లేటు వయస్సులో ఆయన గారికి ఏమనిపించిందో ఏమో గానీ భార్యతో విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కాడు. ఇందుకు ఆయన భార్య 6వేల కోట్ల రూపాయిలు భరణంగా ఇస్తే విడాకులు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇందుకు హరొల్డ్ ఒప్పుకోవడం, అధికారికంగా ఒప్పంద పత్రాలపై సంతకం చేయడం చకాచకా జరిగింది. మొత్తానికి ఈ విలువైన విడాకులు విడాకుల చరిత్రలో విశిష్టంగా నిలిచిపోవడం ఖాయం.