ఐటీ రంగంలో అత్యుత్తమ సర్టిఫికేషన్ అయిన మైక్రోసాఫ్ట్ గుర్తింపుపొందిన ప్రొఫెషనల్ పరీక్షను ఐదేళ్ల పిల్లాడు అలవోకగా రాసి విజయం సాదించాడు. లండన్ కు చెందిన అయాన్ ఖురేషి (5) అనే ఐదేళ్ల కుర్రాడు మైక్రోసాఫ్ట్ పరీక్షలో ఉత్తీర్ణతను సాధించి అతిచిన్న వయసులో సర్టిఫికెట్ ను సాధించాడని బీసీసీ గురువారం కథనాన్ని ప్రసారం చేసింది. డిగ్రీ పూర్తిచేసిన వారు రాసే ఈ పరీక్షను అయాన్ ఐదేళ్ళకే రాసి, పాసై మరీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంకో వింత ఏంటంటే ఎంతో కష్టతరమైన ఈ పరీక్షను అయాన్ అందరికన్నా ముందే రాసి ఇచ్చి మరీ వచ్చాడట. ‘అయాన్ కు మూడేళ్ల నుంచే కంప్యూటర్ నేర్పించాను. నా పాత కంప్యూటర్లతో ఆడుకుంటూ అయాన్ కంప్యూటర్లలోని సంక్షిష్టమైన పరికరాల గురించి తెలుసుకునేవాడు’ అని అయాన్ తండ్రి అసీమ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. సాధారణంగా మైక్రోసాఫ్ట్ సంస్థ చిన్న పిల్లలను పరీక్ష రాయడానికి అనుమతించరని, అయితే అయాన్ విషయంలో మాత్రం సంస్థవారు ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆయన వివరించాడు. అలాగే మొదట్లో అయాన్ కి పరీక్ష విధానం వివరించడం కష్టమయ్యేదట. కానీ, రాను రాను చాలా చురుగ్గా అన్నింటినీ నేర్చుకున్నాడని తెలిపాడు. అయాన్ కుటుంబం 2009లో పాకిస్థాన్ నుండి ఇంగ్లాండ్ కు వలస వెళ్ళింది. భవిష్యత్తులో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మాదిరిగా యూకేలో కూడా ఓ ఐటీ హబ్ ను ఏర్పాటుచేస్తాడట ఈ బుల్లి ఐటీ టెక్నిషియన్.