గణతంత్ర దినోత్సవ వేడుకల ఆహ్వన విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ క్రేజీవాల్ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ అన్నారు. తనకు ఆహ్వనం అందలేదని కేజ్రీవాల్ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ఆయనింకా చాలా ఎదగాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. కోరుకుంటేనో, డిమాండ్ చేస్తేనో ఆహ్వనాలు రావని, ప్రోటోకాల్స్ ను అనుసరించే వస్తాయని ఆమె అన్నారు. కాగా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ కు ఆహ్వానం పంపకపోవడాన్ని ఆప్ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని కూడా రాజకీయం చేసిందని ఆ పార్టీ నేత యోగేందర్ యాదవ్ ఆరోపించారు. వేడుకల్లో కిరణ్ బేడీ ముందు వరుసలో కూర్చోవటం, పైగా కెమెరాలు ఎక్కువగా ఆమెనే ఫోకస్ చేయడం ద్వారా ఈ విధంగా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. ప్రజలు, ఎన్నికల కమిషన్ కూడా దీన్ని గమనించిన్నట్లు ఆయన తెలిపారు.