స్నేక్ గ్యాంగ్ పై అసలు నేరం రుజువు కాలేదా?

May 10, 2016 | 03:24 PM | 2 Views
ప్రింట్ కామెంట్
snake-gang-convicted-niharonline

స్నేక్ గ్యాంగ్ పై న్యాయస్థానం లో వాదనలు ముగిశాయి. 8 మంది దోషులని ప్రకటించిన కోర్టు ప్రాసిక్యూషన్ వారిపై అత్యాచార ఆరోపణలను మాత్రం నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. మొత్తం 9మందిలో ఏ9గా ఉన్న సలాం హందీ అనే వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. నిర్జన ప్రదేశాల్లో ఊసులాడుకునే యువ జంటలే లక్ష్యంగా హైదరాబాదు పాతబస్తీకి చెందిన స్నేక్ గ్యాంగ్ లెక్కలేనన్ని దురాగతాలకు పాల్పడింది. పాములను చేతిలో పట్టుకుని రంగంలోకి దిగే స్నేక్ గ్యాంగ్ సభ్యులు జంటలోని యువకుడిపై దాడి చేయడంతో పాటు బాధితుడి కళ్లెదుటే అతడి ప్రేయసిపై సామూహిక అత్యాచారాలు చేసిన వైనం ఏడాదిన్నర క్రితం పెను సంచలనం రేపింది.

                          లెక్కలేనంత మందిపై ఈ తరహా దాడులకు దిగిన 9 మంది సభ్యుల స్నేక్ గ్యాంగ్ పై 2014లోనే ఓ యువతి ధైర్యం చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని 9 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. తమకు అందిన సమాచారం మేరకు స్నేక్ గ్యాంగ్ 37 మంది యువతులపై దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.  పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, బాధితుల వాదనలను విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. అయితే బాధితులకు విస్మయాన్ని కలిగిస్తూ, వీరెవరూ అత్యాచారాలకు పాల్పడినట్టు ఆధారాలు లేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వీరు లైంగిక దాడులు చేశారని ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయిందని న్యాయమూర్తి ప్రకటించారు. కేవలం దోపిడీ, అసభ్య ప్రవర్తన ఆరోపణలపైనే వీరు ముద్దాయిలుగా తేలారని వెల్లడించారు. బుధవారం వీరికి శిక్షలు ఖరారుకానుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ