అసలే పాలమూరు పరగణా... పరమవెనుకబడిన ప్రాంతమని ఎవరికీ బొట్టుపెట్టి విశదీకరించక్కర్లేదు. అక్కడి నాగరికత కూడ అలాగే తగలబడిందనడానికి తాజా ఉదాహరణ పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామ సంఘటన. రఘురాముడనే అసామి శుభమా అని పెళ్లిచేసుకుని గుళ్లోకెళ్లి కొబ్బరికాయ కొట్టాడు. ఆ పాపానికి భక్తకన్నప్ప వంశీకులు వీరావేశంతో మాదిగ కులస్తులను చీల్చి చెండాడేరు. వారి దేవేంద్ర భవనాన్ని నేలమట్టంచేసి, మరో కారంచేడుగా మారుస్తామని ప్రతిన బూనేరు. వారినందరికీ సాంఘిక బహిష్కరణ శిక్ష అమలు చేస్తున్నారు. కారంచేడు ఘటన జరిగి మొన్ననే ముప్ఫయి సంవత్సరీకాలయిన సందర్భంగా సానుభూతిపరులందరూ కంటకన్నీరుపెట్టుకున్నారు. కీర్తిశేషులు దగ్గుబాటి చెంచురామయ్య ప్రభృతుల్ని తలుచుకుని నిందాస్తుతి చేయడం జరిగింది. మరి ఈ బోయ ప్రభువులకేమొచ్చింది? బుద్ధిచెప్పి గడ్డి పెట్టేందుకు అంబేద్కరు మహాశయుడు లేనందున, వారి మనవడు ఆనంద్ దిగివచ్చి అభయమిచ్చేడు. పాపం, దాసరి తన రాములమ్మ సినిమాలో మూడుకోట్ల దేవుళ్ల కమిటీలో ఒక్క దళితుడే లేకపాయె అని బాధపడ్డాడు. బోయలు, మాదిగల్లో ఎవరిది అగ్రవర్ణం కన్నప్పా?