చీకట్లో చుక్కేసి రోడ్లపై స్పీడ్ గా వెళ్తు చుక్కల్లో విహరించేవారికి కోర్టులు ఇకపై పట్టపగలు కూడా చుక్కలు చూపిస్తాయట. మద్యం తాగి వాహనాలు నడపటం ఎంత ప్రమాదకరమో మనకు తెలియంది కాదు. మందుకొట్టి, స్టీరింగ్ పట్టి అభాగ్యుల ప్రాణాలను గాల్లో కలిపేయడమే కాకుండా, తాము కూడా ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఎన్ని సార్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సరే పదే పదే కేసులో ఎక్కువ అవుతున్నాయి. అందుకే హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల కాస్త సీరియస్ గానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి న్యాయస్థానాలు. పదుల సంఖ్యలో పట్టుబడ్డ మద్యం బాబులకు ఎర్రమంజిల్ న్యాయస్థానం వెరైటీ శిక్షను విధించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు మూడు గంటలపాటు హైదరాబాద్ లోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద విధులు నిర్వర్తించాలని ఆదేశించింది. అంతేకాదు ఇకపై ఇలా పట్టుబడ్డవారికీ ఇదే శిక్షను విధిస్తామని స్పష్టం చేసింది. ఫైన్ కట్టి పోవచ్చులే అనుకునే బాబులకు ఇకపై కాస్త బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే అనుకోవాలి. వర్షకాలమే అయినా భానుడి ప్రతాపంతో వేసవిని తలపిస్తుంది. మరి ఇలాంటి టైంలో పట్టుబడే ఇంకేమన్నా ఉందా. చెమట చుక్కలు కారిపోవు. మరోపక్క జనాలు కూడా ఇలా సామాజిక సేవాశిక్షలను విధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సో ఇకపై భాగ్యనగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారో ఇక మీ పని అంతే సుమీ!