ఇందిరా పార్కే బెటర్ అంటున్నాడు

December 08, 2014 | 10:28 AM | 30 Views
ప్రింట్ కామెంట్

ఎన్నికల ముందు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి మీద ఆశపడి రాజకీయ రంగప్రవేశం చేసిన ఎల్బీనగర్ ఎమ్మల్యే ఆర్. కృష్ణయ్య ఇప్పుడు మాత్రం అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాను అనుకుంటున్నారట. సీఎం అభ్యర్థి ఎర చూపి రంగంలోకి దింపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు చివరకు పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా అవకాశం ఇవ్వకుండా పోవడమే కృష్ణయ్య అసంతృప్తికి కారణమైంది. కనీసం తెలంగాణలో పార్టీ ప్రెసిడెంట్ పదవైనా దక్కుతుందేమో అనుకుంటే ఎన్నికలు జరిగి ఆరు నెలలు దాటినా ఆ ఊసే లేదు. దీంతో గత కొంత కాలంగా టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉండడమే కాకుండా ఎక్కడా కనీసం ఆ పార్టీ కండువాను కూడా కప్పుకోవడం లేదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హజరయినప్పటికీ ఆయన మాత్రం తనదారి తనది అన్నట్లుగా వ్యవహరించారు. టీడీపీ గందరగోళం సృష్టించినా కృష్ణయ్య మాత్రం నిమ్మకునీరెత్తినట్లే ఉండటం విశేషం. పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తే వారినే అనుసరించేవారు తప్ప వారితో అసలు సంబంధం లేనట్లు ఉండేవారు. దీంతో ఆయన కూడా కారు ఎక్కుతారనే వార్తలు షికారు చేశాయి. ఈ వ్యవహారమంతా గమనిస్తున్న టీడీపీ శాసనసభపక్షనేత ఎర్రబెల్లి కృష్ణయ్యను కదిలించారట. దాంతో కృష్ణయ్య మనస్సుల్లో ఉన్నదంతా వెల్లగక్కారట.సభలో మాట్లాడే అవకాశమే రాలేదు. ఇంతకన్నా ఇందిరా పార్క్ దగ్గరే నయం. ఉద్యమాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగినప్పుడు మాట్లాడేవాడిని. ఇప్పటికిప్పుడు నేను మాట్లాడాలనుకుంటే ఇందిరా పార్క్ వద్దకు వెళ్లటమొక్కటే మార్గం అని వాపోయారట. పాపం కృష్ణయ్య. మరి అంత ఇబ్బంది పడి ఉండటం అవసరమా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ